రఘురామకృష్ణరాజును సీఐడీ ఆఫీసులో చిత్ర హింసలు పెట్టి .. హత్య చేయాలనుకున్న కేసులో తులసీబాబు అనే ప్రైవేటు వ్యక్తి అత్యంత కీలకంగా మారారు. అప్పట్లో సీఐడీ డీజీగా ఉన్న సునీల్ కుమార్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఈ తులసీబాబును.. అడ్వయిజర్‌గా నియమించారు. సీఐడీకి లీగల్ అడ్వయిజర్ గా తులసీబాబుకు సునీల్ కుమార్ పోస్టు ఇచ్చారు. ఇలా అక్రమంగా అరెస్టు చేసుకొచ్చిన వారిని ఎలా కొట్టాలో.. లేకపోతే వారి గుండెల మీద కూర్చుని శ్వాస ఆగిపోయేలా చేయడానికి ఏం చేయాలో సలహాలు ఇచ్చాడో కానీ.. ఇప్పుడు దొరికిపోయాడు.
తనను అరెస్టు చేయకుండా టీడీపీ పేరుతో బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన తులసీబాబుకు పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. ఆయన పాత చరిత్ర అంతా బయటకు తీశారు. రఘురామను అరెస్టు చేసిన రోజున తాను సీఐడీ ఆఫీసుకు రాలేదని బుకాయించినా.. సాంకేతిక ఆధారాలన్నీ ముందు పెట్టడంతో ఆయనకు నోట మాట రాలేదని తెలుస్తోంది. అంతే కాదు.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జె.పంగులూరుకు చెందిన ఆయన అక్కడ అగ్రిగోల్డ్ నిధులు కొట్టేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దానిపైనా పోలీసులు ప్రశ్నించండతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
తులసీబాబు .. సస్పెండెడ్ ఐపీఎల్ సునీల్ కుమార్ తో కలిసి చేసిన దందాలను పోలీసులు వెలికి తీయనున్నారు. జగన్ హయాంలో టీడీపీ నేతలపై, కార్యకర్తలపై సీఐడీ విభాగాన్ని ప్రయోగించి పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన సునీల్ కుమార్ ను.. ఆయన అరాచకాల్ని వదిలి పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. తులసీబాబు ద్వారానే మొత్తం బయటకు లాగనున్నారు.