సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న భాషా ప్రయోగం అన్ని రకాల హద్దులు దాటిపోయింది. నిజానికి రేవంత్ రెడ్డికి కాకపోయినా ఆయన నిర్వహిస్తున్న పదవికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ప్రజలందరికీ ముఖ్యమంత్రి. అంతటి గౌరవనీయమైన స్థానంలో ఉన్న వ్యక్తిని వాడు, వీడు, లొట్టపీసు అని.. ఇంకా ఘోరమైన పదాలతో బహిరంగంగా మీడియా ముందు తిడుతున్నారు. కేటీఆర్ ను చూసి ఆయన అనుచరులు కూడా మీడియా ముందు అదే చెబుతున్నారు. ఓ అడుగు ముందుకేసి బూతులందుకుంటున్నారు.
కేటీఆర్ అయినా.. బీఆర్ఎస్ నేతలు అయినా ఆవేశాన్ని, కోపాన్ని తగ్గించుకుని కాస్త ఆలోచిస్తే.. తమ భాష వల్ల రేవంత్ కు ఏ మాత్రం నష్టం జరగకపోగా.. తమ పార్టీకి మాత్రం డ్యామేజ్ అవుతుందన్న సంగతి గుర్తుకొస్తుంది. రాజకీయాల్లో బూతుల్ని ప్రజలు సహించరు. ఆ విషయం ఏపీ ఎన్నికల్లోనే రుజువు అయింది. అధికారంలో ఉండి.. మరీ ప్రతిపక్ష నేతలపై వైసీపీ నేతలు చేసినా భాషా ప్రయోగం వికటించింది. ఇప్పుడు అధికార పార్టీ.. ముఖ్యమంత్రిపైనే బీఆర్ఎస్ నేతలు ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రేవంత్ రెడ్డి కూడా అదే భాష మాట్లాడుతున్నారని అంటున్నారు కానీ.. ఇటీవలి కాలంలో ఆయన అలాంటి భాష మాట్లాడటం లేదు. పద్దతిగానే ప్రసంగిస్తున్నారు. ఒక వేళ అలాంటి భాషను రేవంత్ రెడ్డి కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజల్లో ప్రభావం చూపుతుంది. కానీ దొందూ దొందే అనిపించేలా బీఆర్ఎస్ నేతలు మాటల దాడి చేస్తే.. ఎవరికి నష్టం?.రాజకీయాల్లో ఓపిక ఉండాలి.. వ్యూహం ఉండాలి. అప్పటికప్పుడు మాటకు మాట.. బూతుకు బూతు అంటే… ఇతర పార్టీల ట్రాప్ లో పడిపోయినట్లే.