గాలి జనార్దన్ రెడ్డి చేసిన మైనింగ్ దోపిడీపై విచారణ గడువును ఇక పొడిగించేది లేదని నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. ఇప్పటి వరకు ఏళ్ల తరబడి పొడిగిస్తూ వస్తున్నామని ఇక పొడిగించేది లేదని స్పష్టం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి ఏపీ, కర్ణాటక సరిహద్దుల్ని కూడా తవ్వేసి ఐరన్ ఓర్ను స్మగ్లింగ్ చేసి వేల కోట్లు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి డబ్బులతో ఆయన రాజకీయాలు కూడా చేశారు. అయితే ఆయన పాపం పండి.. సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత బెయిల్ కోసం జడ్జికి కూడా లంచం ఇచ్చి దొరికిపోయారు. ఇలాంటి అనేకానేక కేసులు ఉన్నాయి.
ఆ కేసులు ఏళ్ల తరబడి విచారణ సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ పూర్తి చేయాలని ఆదేశించడంతో ఇక సీబీఐకు మరో చాన్స్ లేకుండా పోయింది. కళ్ల ముందు కనిపిస్తున్న సాక్ష్యాలతో ఆయన చాలా కాలం జైల్లో ఉన్నారు. ఇటీవలి వరకూ బళ్లారిలో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఇటీవలే బళ్లారిలో అడుగు పెట్టేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. జగన్ కేసులు కూడా ఆలస్యమవుతున్నాయన్న పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నాయి. ఈ నెలలో మరోసారి విచారణకు రానున్నాయి. గాలి కేసుల్లో ధర్మాసనం స్పందించిన దాన్ని బట్టి చూస్తే జగన్ కేసుల్లోనూ సుప్రీంకోర్టు స్పష్టమైన సూచనలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
జగన్ అక్రమాస్తుల కేసులో చార్జిషీట్లు దాఖలయ్యాయి. కానీ ట్రయల్ ప్రారంభం కాకుండా నిందితులు వరుసగా రకరకాల పిటిషన్లు వేస్తున్నారు. ఆ పిటిషన్లపై విచారణ పూర్తయి తీర్పు వచ్చే సమయంలో న్యాయమూర్తులు సీబీఐకోర్టు నుంచి బదిలీ అయ్యేవారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఏళ్లు గడిచిపోతున్నా బెయిల్ మీదే రాజకీయాలు చేస్తున్నారు. చివరికి సీఎం అయి మరిన్ని ఘోరాలు చేశారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఆయన కేసుల్ని త్వరగా విచారణ చేయాలని.. న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకుని నిందితుడు బయటపడకుండా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో .. గాలి కేసుల్లో వచ్చిన తీర్పు ఆసక్తికరంగా మారింది.