దానం నాగేందర్ కాంగ్రెస్ కు మెల్లగా దూరమవుతున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆయనకు.. తనకు కాంగ్రెస్ సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అనుకుంటున్నారు. అసలు పట్టించుకోవడంలేదన్న ఉద్దేశంతో మళ్లింది కొత్త కొత్త ప్రకటనలు ప్రారంభించారు. కేటీఆర్ ప్రకటనలను సమర్థిస్తూ మీడియాతో మాట్లాడుతున్నారు.
ఫార్ములా ఈ రేసు వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందని.. అందుకే తాము నిధులు మంజూరు చేశామని కేటీఆర్ చెబుతున్నారు. ఇదే వాదనను దానం నాగేందర్ సమర్థించారు. పార్ములా ఈ వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు. అదే సమయంలో హైడ్రా పై కూడా నాగేందర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.దీని వల్ల ప్రజలకు.. హైదరాబాద్కు చాలా నష్టం జరుగుతోందన్నారు. యూట్యూబ్ చానళ్లకు ఇంటర్యూలు ఇస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అసెంబ్లీలో కేటీఆర్ పై బూతులు మాట్లాడిన వైనం, హెచ్చరించిన వైనం తప్పేనని.. ఆ విషయంలో తాను కేటీఆర్ ను వ్యక్తిగతంగా కలిసి క్షమాపణలు చెప్పానని అంటున్నారు.
దానం నాగేందర్ తీరు చూస్తే.. ఏదో తేడాగా ఉందన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు వస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గొంతెమ్మ కోరికలు కోరారని వాటిని తీర్చేందుకు రేవంత్ ఏ మాత్రం ఆసక్తిగా లేరని అంటున్నారు. అందుకే ఆయన బ్లాక్ మెయిల్ తరహాలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడే తన డిమాండ్ పమిట.. దానం ఇండైరక్ట్ గా చెబుతున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఓ డీసీపీపై కూడా పనిలో పనిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను తొలగించాలన్న డిమాండ్ ఇలా వినిపించారని అనుకోవచ్చు.