హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగు ఉండదని నైట్ ఫ్రాంక్ సంస్థ తాజాగానివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలో హైదరాబాద్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 1.03 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీస్ స్పేస్ అమ్మకం లేదా లీజు లావాదేవీలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే ఇది 17 శాతం ఎక్కువ. 2020 తర్వాత నగరంలో కార్యాలయ స్థలాలకు ఇంత భారీగా డిమాండ్ ఏర్పడటం ఇదే మొదటిసారని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది. కొత్తగా 1.56 కోట్ల ఎస్ఎఫ్టీ ఆఫీస్ స్పేస్ నిర్మాణం పూర్తయింది.
నివాస గృహాల మార్కెట్లోనూ అప్‌ట్రెండ్ కొనసాగింది. గత ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలో 36,974 నివాస గృహాలు అమ్ముడయ్యాయి. 2023తో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. 2023తో పోలిస్తే నివాస గృహాల ధర సగటున 8 శాతం పెరిగింది. అయితే కొత్త నివాస గృహ ప్రాజెక్టుల ప్రారంభం మాత్రం స్లో అవుతోంది. గత ఏడాది మొత్తానికి నగరం, దాని చుట్టుపక్కల 44,013 నివాస గృహాలకు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే ప్రారంభమయ్యాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 6 శాతం తక్కుని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది.
హైదరాబాద్‌లో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉన్న ఇళ్లకు కొనుగోలుదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని నైట్ ఫ్రాంక్ చెబుతోంది. అమ్ముడైన ఇళ్లలో వీటి వాటా 45 శాతం వరకు ఉన్నట్టు ఆ నివేదిక తెలిపింది. 2023తో పోలిస్తే ఇది 8 శాతం ఎక్కువ. బెంగళూరు తర్వాత దేశంలో హైదరాబాద్‌లోనే పలు అంతర్జాతీయ సంస్థలు తమ గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నాయి. గత ఏడాది కాస్త స్లోగా ఉన్నప్పటికీ హైదరాబాద్ రియాలిటి మెరుగైన పనితీరు చూపించింది. ఈ ఏడాది తిరుగులేని వృద్ది నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.