గేమ్ చెంజర్ సినిమాలో ఎఎస్ జే సూర్య, నవీన్ చంద్రకి మధ్య ఓ సీన్ వుంటుంది. 500 మంది అక్రమ ఇసుక కూలీలు గుండా యాక్ట్ లో అరెస్ట్ అవుతారు. బయటికి రావాలంటే మనిషికి పది లక్షలు కావాలి. మనిషికి పది లక్షలే కదా.. రెడీ చేసేద్దామని సింపుల్ గా అంటాడు నవీన్ చంద్ర. ఎస్జే సూర్య, నవీన్ చంద్రని దగ్గరికి పిలిచి.. ”డబ్బు విలువ తెలియని వాడంటే అసలు నాకు నచ్చదు. 500 మంది, మనిషికి పది లక్షలు.. అసలు క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కపెట్టడం తెలుసారా నీకు” అంటాడు సూర్య. ఏ ఉద్దేశంతో ఈ డైలాగ్ రాశారో కానీ ఈ మాట సరిగ్గా దర్శకుడు శంకర్ కి నప్పుతుంది.
గేమ్ చెంజర్ మేకింగ్ చూసిన తర్వాత అసలు శంకర్ కి బడ్జెట్ క్యాలిక్యుషన్స్ ఉండవా అనిపించింది. డిమాండ్ చేయని గ్రాఫిక్స్, అవసరం లేని లోకేషన్స్, కథకు అక్కర్లేని ప్యాడింగ్ ఆర్టిస్టులు, కుప్పలు తెప్పలుగా జనసమీకరణ.. ఇలా అనవసరంగా బడ్జెట్ ని ఎన్ని రకాలుగా పెంచాలో అన్ని రకాలుగా పెంచి నిర్మాతని కుదేలు చేసి పారేశారు.
నిజంగా ఆ మేకింగ్ చూస్తే కడుపు తరుక్కుపోతుంది. డబ్బుని ఇంత మంచి నీళ్ళు ప్రాయంగా ఖర్చు చేయడం చూస్తే శంకర్ పై అసహనం వచ్చేస్తుంది. ఓ పొలం గట్టుపై నెల్లూరి నరజాన లాంటి క్లాసిక్ సాంగ్ తీసిన శంకర్ లోని క్రియేటర్ ఏమయ్యాడనిపిస్తుంది. పోనీ ఇంత డబ్బు ఖర్చు చేసి తీసిన షాట్లు, సన్నివేశాలు ప్రేక్షకులపై ఇంపాక్ట్ ని చూపించాయా? అంటే లేదు. అన్నీ అర్టిఫీషియల్ గా తయారైయ్యాయి. శంకర్ భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్మెన్, అపరిచితుడు లాంటి టైమ్ లెస్ క్లాసిక్ ని తన బ్యానర్ కి ఇస్తారేమో ఆశలలో పెట్టుకొని కోట్లు ఖర్చు చేసిన నిర్మాత దిల్ రాజు ఆశలన్నీ అడియాశలయ్యాయి.