తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టీ పీసీసీ చీఫ్ కొత్త ముహుర్తం ఖరారు చేశారు. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. అంతే కాదు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని ఆయనంటున్నారు. ఈ మాట ఏడాదిగా చెబుతున్నారు. చేరికలు, మంత్రి వర్గ విస్తరణ అనేది ఓ పెద్ద ప్రక్రియగా సాగిపోతోంది. ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే పోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సార్లు ఢిల్లీ వెళ్లినా అనుమతి మాత్రం రావడం లేదు. పార్లమెంట్ సమావేశాలు.. అసెంబ్లీ సమావేశాలు.. మహారాష్ట్ర ఎన్నికలు అంటూ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి.
ఈ సారి అయినా జరుగుతుందో చలేదో కానీ.. టీ పీసీసీ చీఫ్ ముహుర్తం పెట్టేశారు. మరో వైపు చేరికల గురించి కూడా ఆయన చాలా కాలంగా చెబుతున్నారు. కానీ ఎవరు పార్టీలో చేరుతారో మాత్రం స్పష్టత లేదు. పార్టీలో చేరిన వారే భిన్నంగా మాట్లాడుతున్నారు. దానం నాగేందర్ ఇప్పటికే రివర్స్ అయ్యారు. ఆయన కోరికలు ఏవీ తీర్చడం లేదని ఫీలవుతున్నారు. అదే సమయంలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థినీ ఖరారు చేయలేకపోయారు. బీజేపీ ఇప్పటికే మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. కానీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదు. మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామన్నారన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెబుతున్నారు. వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని.. కార్పోరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని అంటున్నారు. .. మహేష్ గౌడ్ చెప్పే వివరాల ప్రకారం.. ఏడాది దాటిపోయినా.. ఇంకా ఎన్నో పనులను కాంగ్రెస్ పెండింగ్ లో పెట్టుకుందని సులువుగా అర్థమైపోతుంది.