అధికారంలో ఉన్న పార్టీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. తాము ఏం చేసినా అది అధికార దుర్వినియోగం, చట్టాల ఉల్లంఘన అని ప్రజలకు అనిపిస్తే తర్వాత వచ్చే ఫలితాలు అత్యంత దుర్భరంగా ఉంటాయి. అధినేతలు అంతా జాగ్రత్తగానే ఉన్నా.. కింది స్థాయి నేతలు చేసే పనుల వల్ల మొదటికే మోసం వస్తుంది. కాంగ్రెస్ క్యాడర్ ఇప్పుడు కట్టుతప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంపైనే దాడి చేశారు. తాజాగా బీఆర్ఎస్ భువనగరి జిల్లా కార్యాలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు.
ఇతర పార్టీల కార్యాలయాలపై .. అధికార పార్టీ కార్యకర్తలు దాడిచేస్తే అది చిన్న విషయం కాదు. రాజకీయ కారణాలతో దాడులు చేయడాన్ని ఎవరూ హర్షించరు. ఇంతగా తెగిస్తున్న వీరు సామాన్యప్రజల్ని వదులుతారా అన్న ప్రశ్న వస్తుంది. అందుకే అధికార పార్టీ కార్యకర్తల్ని అదుపులో ఉంచేందుకు .. పై స్థానాల్లో ఉన్నవారు గట్టిగా ప్రయత్నిస్తారు. కావాలని దాడులు చేస్తే ఊరుకునేదిలేదని సంకేతాలు పంపుతారు. చట్ట ఉల్లంఘన చేయవద్దని హెచ్చరిస్తారు. అయితే తెలంగాణలో క్యాడర్ ఇప్పుడు అలాంటివేమీ పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.
బీజేపీ ఆఫీసుపై దాడి ఘటనలో నిందితులు కాంగ్రెస్ వారైననప్పటికీ కఠినచర్యలు తీసుకోలేదు. ఫలితంగా భువనగిరి జిల్లాలో అక్కడి నేతలు కాంగ్రెస్ ను తిట్టారని చెప్పి పార్టీ ఆఫీసుపై దాడి చేశారు. అంతకు ముందు అల్లు అర్జున్ ఇంటిపై దాడిచేసిన వారు కూడా కాంగ్రెస్ కార్యకర్తలేనని ప్రచారం ఉంది. ఇలాంటి దాడుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ లో విఫలమయిందన్న ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు చోటామోటా కాంగ్రెస్ నేతలు కూడా ఇదేనని చేసి.. తమ దందాలు షురూ చేస్తారు. ఆ తర్వాత కంట్రోల్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. అప్పటికే చేతులు కాలిపోతాయి.