ఢిల్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాము ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా మార్చేస్తామని ఎవరూ చెప్పడం లేదు. తను గెలిపిస్తే ఏ ఓటర్ కు ఎంత ఇస్తామో కథలు చెబుతున్నారు. మేనిఫెస్టోలను పుస్తకాల రూపంలో ప్రచురించి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం ఏ పార్టీ కూడా తక్కువ కాదు.
ఢిల్లీలో మరోసారి పీఠం చేపట్టాలని గట్టి పట్టుదలగా ఉన్న కేజ్రీవాల్..తనను రాజకీయకుట్రలతో అరెస్టు చేశారన్న సానుభూతి పొందడంతో పాటు ఉచిత పథకాలకే ఎక్కువ ప్రాథాన్యం ఇస్తున్నారు. ఫ్రీ బస్ అనే కాన్సెప్ట్ ను మొదట తీసుకువచ్చి అమలు చేసి మహిళల అభిమానాన్ని పొందిన పార్టీ ఆప్నే. అయితే ఆ పథకంపేరుతో ప్రతీ సారి ఓట్లు పొందలేరు. అందుకే ఈ సారి మరింత ఎక్కువ ఉచిత హామీలు ఇస్తున్నారు. మహిళలకు నెలా నెలా డబ్బులు, ఆస్పత్రి ఖర్చులు లేకుండా చేయడం సహా.. పలు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటించారు.
అందని ద్రాక్షలా మారిన ఢిల్లీ అసెంబ్లీని చేజిక్కించుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆ పార్టీ ఉచిత హామీల విషయంలో గీత దాటేసింది. ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు ఇస్తామన్నహామీతో పాటు ఉచిత విద్యుత్ తో పాటు మరిన్ని భారీ ప్రయోజనాలు ఇస్తామని చెబుతోంది. ఇంకా ఇలాంటి హమీలతో మేనిఫెస్టోనూ రెడీ చేస్తున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గడంలేదు. గెలుస్తారో తెలియదుకానీ.. ప్రజలు నమ్మితే మాత్రం జాక్ పాట్ కొట్టేసినట్లే అవుతుందని.. గ్యారంటీలను ప్రకటించారు.
ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. ప్రభుత్వాలకు ఉండే అధికారాలు పరిమితం. మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల మీదుగానే నడుస్తుంది. బీజేపీ మినహా ఏ పార్టీ గెలిచినా…కేంద్రం నుంచి ఇబ్బందులు పడాల్సిందే.