Daaku Maharaaj movie review
తెలుగు360 రేటింగ్: 3/5
మాస్ యాక్షన్ కథలకు చిరునామా నందమూరి బాలకృష్ణ. ఆయనతో సినిమా అంటే లార్జర్ దెన్ లైఫ్ మాస్ యాక్షన్ కథలనే అల్లుకుంటారు దర్శకులు. ‘డాకు మహారాజ్’ ప్రచార చిత్రాలు చూసినప్పుడు.. దర్శకుడు బాబీ కూడా బాలయ్యలోని మాస్ ని మరో స్థాయికి తీసుకెళ్ళే కథ సిద్ధం చేశారనే నమ్మకం కలిగింది. ప్రస్తుతం బాలయ్య మంచి ఫామ్ లో వున్నారు. 2023లో ‘వీరసింహారెడ్డి’తో సంక్రాంతి బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. మరి డాకు తో బాలయ్య విజయ పరంపర కొనసాగిందా? బాబీ, బాలయ్యని ఎంత కొత్తగా చూపించారు? డాకు మహారాజ్ సంక్రాంతి బోణీ కొట్టాడా?
చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన కృష్ణమూర్తి(సచిన్ ఖేడ్కర్)విద్యావేత్త. ఓ పెద్ద స్కూల్ ని నడుపుతుంటాడు. తనకో కాఫీ ఎస్టేట్ వుంటుంది. దాన్ని లీజుకి తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు (రవి కిషన్) అక్కడ వన్యమృగాలని అక్రమంగా తరలిస్తుంటాడు. త్రిమూర్తులు అరాచకాలు హద్దుమీరడంతో పోలీసులని ఆశ్రయిస్తాడు కృష్ణమూర్తి. దీంతో పగ పెంచుకున్న త్రిమూర్తులు,, కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవికి ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించడానికి ఆ ఇంట్లో పని చేస్తున్న మకరంద్ దేశపాండే చంబల్ లోని మోస్ట్ వాంటెడ్ మహారాజ్ (బాలకృష్ణ)కు కబురుపెడతాడు. మహారాజ్ నానాజీగా పేరు మార్చుకొని పాపకి డ్రైవర్ గా చేరుతాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు? ఆ పాపకి తనతో వున్న సంబంధం ఏమిటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్ (బాబీ డియోల్) నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? అసలు మహారాజ్, నానాజీ గా పేరు మార్చుకొని రావాల్సిన అవసరం ఏమిటి? తనకు ఎలాంటి శత్రువులు వున్నారు? ఇవన్నీ తెరపై చూడాలి.
మాస్ యాక్షన్ కథలని కొత్తగా చూపించడం దర్శకులకు పెద్ద ఛాలెంజ్. పైగా బాలయ్యతో యాక్షన్ సినిమా అంటే అది మరింత టఫ్. ఎందుకంటే ఆయన ఇప్పటికే బోలెడు యాక్షన్ కథలు చేశారు. అయితే దర్శకుడు బాబీ ఇక్కడే చాలా తెలివిగా అలోచించగలిగాడు. బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఓ ఫ్యాక్షన్ కథని చంబల్ బ్యాక్ డ్రాప్ కి షిప్ట్ చేశారు. దీంతో డాకు మహారాజ్ కొత్త కలర్ సెట్ అయ్యింది. బ్యాక్ డ్రాప్ మాత్రమే కాదు ఇందులో టోటల్ యాక్షన్ సగటు తెలుగు మాస్ కమర్షియల్ సినిమాకి భిన్నంగా హాలీవుడ్ స్లీక్ యాక్షన్ ని తలపించేలా డిజైన్ చేశారు. ఈ యాక్షన్ తెరపైకి సూపర్బ్ గా వచ్చింది. కథ ‘చెడుపై పోరాడే హీరో’ అనే రెగ్యులర్ టెంప్లెట్ లో ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే, యాక్షన్ లో చూపించిన వైవిధ్యం డాకు మహారాజ్ కి కొత్తదనం అద్దింది.
డాకు మహారాజ్ కథ ఎత్తుగడే భిన్నంగా ఉంటుంది. అడవిలో సెట్ చేసిన ఓ భారీ ఇంటర్వెల్ బ్యాంగ్ ని తొలి సన్నివేశంలోనే చూపిస్తూ కథని మొదలుపెడతారు. కృష్ణమూర్తి కుటుంబం, పాప, ఎమ్మెల్యే త్రిమూర్తులు, అతడి తమ్ముడు.. ఈ పాత్రల చుట్టూ బిగినింగ్ లో నడిపిన సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగుతాయి. నానాజీగా బాలయ్య ఎంట్రీ తర్వాత కథ పుంజుకుంటుంది. తొలి సగంలో పాప ఎమోషన్ ని ఎస్టాబ్లెస్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. మరోవైపు స్పెషల్ ఆఫీసర్ స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) డాకు గురించి చేసే అన్వేషణ ఆ పాత్ర పై ఆసక్తిని పెంచేలా వుంటుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ తర్వాత వచ్చే డబిడి దిబిడి సాంగ్ వన్స్ మోర్ అనేలా కుదిరింది. ఈ సినిమాకి మొదటి నుంచి హైలెట్ గా చెప్పుకుంటూ వస్తున్న ఇంటర్వెల్ బ్లాక్ .. నిజంగానే అదిరింది. ఓ ఇరవై నిముషాలు పాటు సాగే ఆ సీక్వెన్స్ థియేటర్లో ఎంజాయ్ చేయాల్సిందే.
డాకు మహారాజ్ కథకు మూలం సెకండ్ హాఫ్ లో వుంది. నీటి కోసం అల్లాడుతున్న చంబల్ ప్రజల బాధ ఆడియన్స్ ని హత్తుకునే చూపించగలిగారు. ఈ ఎపిసోడ్ లో సివిల్ ఇంజనీర్ సీతారామ్ గా బాలయ్య కనిపించిన తీరు.. తనని డాకులా మార్చిన పరిస్థితులు సహజంగా కుదిరాయి. నిజానికి బాలయ్య అనేసరికి ఓవర్ పవర్స్ ఇచ్చేస్తుంటారు దర్శకులు. బాబీ మాత్రం సీతారామ్ పాత్రని చాలా సెటిల్ గా నడిపాడు. జరుగుతున్న అన్యాయాన్ని చూసే తనలోని నరసింహా రూపం నిద్రలేస్తుంది తప్పితే వాంటెడ్ గా ఊచకోత అన్నట్టుగా వుండదు. సెకండ్ హాఫ్ లో హైలట్ గా చెప్పుకునే బ్లాక్స్ వున్నాయి. కలెక్టర్ ప్యాలెస్ సీన్, ఇసుక తుఫాన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేకంగా నిలుస్తాయి.
డాకు మహారాజ్ లో ప్రతికూల అంశాలు లేకపోలేదు. బ్యాక్ డ్రాప్ చంబల్ అయినప్పటికీ దీని ఇన్నర్ టెంప్లెట్ కథ రొటీన్ గా వుంటుంది. క్లైమాక్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా ఒక దశకి వచ్చిన తర్వాత ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. విలన్ ని సెకండ్ హాఫ్ కే పరిమితం చేయడంతో అంత సంఘర్షణ కుదరదు. ఆడియన్స్ లో ఎమోషన్ రప్పించడానికి చిన్నపిల్లల పాత్రలని కావాల్సినదాని కంటే ఎక్కువ హింస పెట్టారనే భావన కలుగుతుంది.
యాక్షన్ పాత్రలు బాలయ్యకి కొట్టినపిండి. డాకు మహారాజ్ కూడా ఆయనకి అలవాటైన పాత్రే. అయితే ఇందులో యాక్షన్ చాలా డిఫరెంట్. అరుపులు కేకలు వుండవు. చాలా డీసెంట్ స్లీక్ యాక్షన్ లో బాలయ్య ని చూడటం అభిమానులకు కూడా కొత్త అనుభూతి. అలాగే ఎమోషన్స్ ని కూడా చాలా సెటిల్ గా చేశారు. ఆయన డైలాగ్స్ చెప్పిన తీరుకి తిరుగులేదు. ఆయన క్యారెక్టర్ మేకోవర్, ఎనర్జీ కూడా బావుంది. ప్రగ్యా జైస్వాల్ తో పోలిస్తే శ్రద్ధా శ్రీనాథ్ కి మంచి పాత్ర దక్కింది. కోర్ ఎమోషన్ ఆ పాత్రే నుంచే వస్తుంది. బాబీ డియోల్ స్టయిలీష్ ప్రజెన్స్ యాక్షన్ కి కొత్త లుక్ తీసుకొచ్చింది. ఊర్వశి రౌతేలా పాటలో అదరగొట్టింది. మకరంద్ దేశ్ పాండే చంబల్ బ్యాక్ డ్రాప్ కి సరిపోయారు. సచిన్ ఖేడ్కర్, చాందిని చౌదరి, పాపగా నటించిన బాలనటి డీసెంట్ గా కనిపించారు. రవి కిషన్ పాత్ర చివర్లో గమ్మత్తుగా వుంటుంది. సందీప్ రాజ్ చెప్పే ఓ మేనరిజం డైలాగ్ నవ్విస్తుంది.
బాలయ్య సినిమా అనగానే తమన్ కి పూనకాలు వచ్చేస్తాయి. డాకులో కూడా చాలా చోట్ల పూనకాలు తెప్పించే బీజీఎం వుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో తమన్ బీజీఎం బాక్సులు అదిరిపోయేలా వుంటుంది. అలాగే దాదాపు ఎలివేషన్ సీన్స్ అన్నిటికి అదిరిపోయే ఆర్ఆర్ ఇచ్చాడు. డబిడి దిబిడి సాంగ్ మాస్ కి నచ్చేలానే వుంటుంది. డీఓపీ విజయ్ కన్నన్ విజువల్స్ రిచ్ గా వున్నాయి. ఎడారిలో తీసిన సన్నివేశాలు కొత్త అనుభూతిని ఇస్తాయి. యాక్షన్ ని ఆయన కెమెరా స్టయిలీష్ గా చిత్రీ కరిచింది.’ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. వార్నింగ్ చచ్చే వాడు కాదు చంపేవాడు ఇవ్వాలి. సింహం నక్కల మీదకి వస్తే వార్ అవ్వదురా.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’ ఈ డైలాగ్స్ ప్లేస్మెంట్ బాగా కుదిరింది. ట్రోల్స్ లో ఎక్కువగా వినిపించే ‘అది చెప్పు..ముందు’ ఈ సినిమాలో కరెక్ట్ ప్లేస్ మెంట్ లో వాడుకోవడం బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. కొత్త స్టంట్స్ వున్నాయి. క్లైమాక్స్ పోర్షన్ ని ఇంకాస్త షార్ఫ్ గా ఎడిట్ చేసే ఛాన్స్ వుంది. సితార నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి.
బాలయ్య బలం మాస్ యాక్షన్. దీన్ని దర్శకుడు బాబీ ఇదివరకెన్నడూ చూడని స్టయిలీష్ కోణంలో చూపించడంలో పైచేయి సాధించాడు. డాకు మహారాజ్ యాక్షన్ ని కొత్తగా చూడాలనుకొనే ప్రేక్షకులకు నచ్చే సినిమా. అభిమానులకైతే పండగ లాంటి సినిమా.
తెలుగు360 రేటింగ్: 3/5