జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఆయన కౌంటర్ ఇచ్చే పద్దతి వేరుగా ఉంటుంది. తిరుమలలో జరిగిన దుర్ఘటన కేంద్రంగా వైసీపీ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయన ఆధారాలతో సహా.. తనదైన లాంగ్వేజ్‌లో ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతోంది. జగన్ రెడ్డి హయాంలో జరిగిన దుర్ఘటలన్నింటినీ ఓ ఫ్లెక్సీగా వేసి.. దాన్ని గోడకు తగిలించి దాని ముందు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ దుర్ఘటనలు జరిగినప్పుడు ఒక్కరంటే ఒక్క వైసీపీ నేతల స్పందించలేదు. బాధ్యత తీసుకోలేదు. అన్నింటినీ వివరించి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దీనికి జగనాసుర చరిత్ర అని పేరు పెట్టారు.
ఇదే ప్రెస్ మీట్ లో రోజాకు ప్రత్యేకంగా సమయం కేటాయించారు. చెలరేగిపోతున్న రోజాకు కూటమి నేతల్లో ఎవరూ ధీటైనా సమాధానం ఇవ్వలేదు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం.. రోజాకు గట్టిగా రిప్లై ఇచ్చారు. శ్రీవారి దర్శన్ టిక్కెట్లు అమ్ముకుని రోజా బెంజ్ కారు కొన్న వైనాన్ని గుర్తు చేశారు. ఆమె చేసిన టిక్కెట్ల స్కాంపై దర్యాప్తు చేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తైతక్కలాడుకుంటూ రాజకీయాల్లోకి వచ్చిన నువ్వు.. ప్రతి దానికి తగుదునమ్మా అంటూ మాట్లాడుతావు….నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దర్శనానికి వెళ్లిన ప్రతిసారి వంద లాది మందిని వెంట తీసుకెళ్లేదని దుయ్యబట్టారు.. ‘‘నీ కథ చెప్పాలంటే చాలా ఉంది… రోజా మీద చెక్ బౌన్స్ కేసులు అనంతపురం కోర్టులో ఉన్నాయన్న సంగతి మరిచిపోవద్దు అని హెచ్చరించారు.
తప్పంతా చంద్రబాబుదేనని…..వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మేము అనేక కష్టాలు పడ్డామని చంద్రబాబు మాత్రం వారిని గాలికి వదిలేశారన్నారు. వైసీపీ నేతలను బయటకు రాకుండా చేయాలన్నారు. ఐదేళ్లలో ఘోరమైన అవినీతి, అక్రమాలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం నింపాదిగా వ్యవహరిస్తూండటం.. చర్యలు కూడా తీసుకోకపోతూండటంతో రోజా లాంటి వారు రెచ్చిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకాదని నేరుగా చెబుతున్నారు. కనీసం కూటమి నేతలు వారికి కౌంటర్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. వైసీపీ హయాంలో బాధలు పడిన జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారే బయటకు వస్తున్నారు. ఎందుకిలా వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.