జగన్ రెడ్డి తన స్థాయి ఎక్కడికి పడిపోయిందో తానే నిరూపిస్తున్నారు. పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలకు వెళ్లి అక్కడి డీఎస్పీ, ఇద్దరు సీఐల్ని హెలిప్యాడ్ వద్దకు పిలిపించుకుని బెదిరించారు. ఎందుకంటే.. వైసీపీ నేతల అక్రమాలు, సోషల్ మీడియా కేసుల్లో వారు దర్యాప్తు చేస్తున్నారట. అలా చేస్తే మీ సంగతి చూస్తానని జగన్ బెదిరించారు. ప్రభుత్వం మారిపోతుందని .. తాము వస్తామని ఆ తర్వాత నీకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. ఆ డీఎస్పీ, సీఐలు.. ఏమని అనుకుని ఉంటారో కానీ.. వైసీపీ క్యాడర్ మాత్రం.. చివరికి మన నాయకుడి పరిస్థితి డీఎస్పీని బెదిరించే స్థాయికి చేరిందా అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు.
రెండు నెలలకో.. నాలుగు నెలలకో.. నాలుగేళ్లకో తాను వస్తానని.. అందరి సంగతి చూస్తానని జగన్ రెడ్డి బెదిరిస్తున్నారు. పదేళ్ల పాటు ఆయన చూసిన విధానం బట్టే ఇప్పుడు పరిణామాలు జరుగుతున్నాయి. తాను మళ్లీ వస్తానని ఆయన ఆశలుపెట్టుకోవడంలో తప్పు లేదు కానీ.. ఆ స్థాయికి అందుకోవడానికి ఓ రేంజ్ మెయిన్ టెయిన్ చేయాలన్న విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. డీఎస్పీలు అయినా సీఐలు అయినా రాజకీయ కేసుల్లో ప్రభుత్వంలో ఉన్న వారు చెప్పినట్లుగా చేస్తారు. చేయకపోతే బదిలీ చేసి తాము చెప్పినట్లుగా చేసేవారిని నియమించుకుంటారు. పదేళ్ల పాటు జగన్ రెడ్డి చేసింది ఇదే. వారిని బెదిరిస్తే ఏమి వస్తుంది ?
పోలీసులు, అధికారులు ముఖ్యంగా కింది స్థాయి అధికారులకు.. తమ పై బాసులు చెప్పింది చేయడం తప్ప.. మరో సాహసం చేయలేదు. దీన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నెన్ని అరాచకాలకు పాల్పడిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు డీఎస్పీనే అంతా చేస్తున్నారని ఆయనను జగన్ బెదిరిస్తున్నారు. ఆయన ఏ మాత్ర విచారణ సరిగ్గా చేయడం లేదని అనిపిస్తే.. వీఆర్ లో ఉన్న అనేక మందిలో కలిసిపోతారు. కొత్త డీఎస్పీ వస్తారు . ఆయన ఇంకా ఎక్కువ చేయవచ్చు. ఎందుకంటే పోస్టింగ్ ఎందుకు ఇచ్చారో ఆయనకు తెలుస్తుంది మరి.
జగన్ రెడ్డి ఇప్పటికైనా.. మాజీ ముఖ్యమంత్రినని.. ఓ పార్టీ అధ్యక్షుడినని గుర్తు పెట్టుకుని కాస్త హుందాగా వ్యవహరించడం నేర్చుకుంటే.. ప్రజులు ఆయన గురించి ఆలోచిస్తారు కానీ ప్రతీ చోటా దిగజారిపోయి వ్యవహరిస్తూంటే… వింతగా చూస్తారు. లెక్కలోకి తీసుకోరు.