ప్రయాగరాజ్ లో మహాకుంభమేళా ప్రారంభమయింది. కనీసం నలభై కోట్ల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగా దాదాపుగా ఏడు వేల కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశారు. ఈ ఆధ్యాత్మిక ఉత్సవం నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది. సాధారణ కుంభ మేళా నాలుగేళ్లకోసారి జరుగుతుంది ఆరేళ్లకోసారి జరిగేదాన్ని అర్థకుంభమేళా అంటారు. ఇది హరిద్వారా లేదా ప్రయాగలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది పన్నెండేళ్లకోసారి జరుగుతుంది. ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తిచేసిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఓసారి అలహాబాద్ లో మహాకుంభమేళా నిర్వహిస్తారు.
ప్రస్తుతం జరుగుతున్న పూర్ణ కుంభమేళానే మహాకుంభమేళా అని అంటున్నారు. భోగి రోజు ప్రారంభమయ్యే కుంభమేళా.. శివరాత్రితో పూర్తవుతుంది. అన్ని రోజుల పాటు దేశం నలుమూలల నుంచి విస్తతమైన ప్రయాణ ఏర్పాట్లను చేశారు. ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న సమస్య రాకుండాపూర్తి స్థాయిలో డిజిటల్ టెక్నాలజీ వాడుతున్నారు. ఏఐ సహకారంతో అన్నీ సింపుల్ గా జరిగిపోయేలా చేస్తున్నారు. దీంతో ఏర్పాట్ల విషయంలో ఎన్ని కోట్ల మంది వచ్చినా సరిపోయేలా ఉండనున్నాయి.
విదేశాల నుంచి పెద్ద ఎత్తున హిందువులు తరలి రానున్నారు. ఇందు కోసం ముందస్తు బుకింగులు చేసుకున్నారు. యూపీ టూరిజం శాఖ టెంట్ సిటీని ఏర్పాటుచేసి విడిది అవసరాలు తీరుస్తోంది. ఈ కుంభమేళా ద్వారా యూపీ సర్కార్ ఏడు వేల కోట్లు పెట్టుబడి పెడితే అంతకు రెండింతల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. కుంభమేళాలో పాల్గొనేలా అత్యధికమందిని ఆకర్షించేందుకు యూపీ ప్రభుత్వం చాలా కాలంగా ప్రచారం చేస్తోంది.