హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సంజయ్ కుమార్ పై దాడి వ్యవహారంలో ఆయన ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పోలీసులుకేసు నమోదు చేసుకుని జూబ్లిహిల్స్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ తరలించి.. అక్కడ కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకూ పలు కేసుల్లో పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసినా ఆయన జైలుకెళ్లకుండా.. వెంటనే రిలీఫ్ పొందుతూ వచ్చారు. కానీ ఈ కేసులో మాత్రం ఆయన జైలుకెళ్లక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
కరీంనగర్ జిల్లా ప్రణాళికా సమావేశంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే అయిన సంజయ్ కుమార్ కు మైక్ ఇవ్వకూడదని వాదనకు దిగారు. ఒరేయ్ ఏ పార్టీరా నీది అంటూ దౌర్జన్యానికి దిగారు. ఆ విషయం పెద్దదయిపోయింది. కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం ఇంకా జోరుగా విమర్శలు చేశారు. కడుపుకు అన్నం తింటున్నారా.. పెండ తింటున్నారా అని కూడా అన్నారు. ఈ వ్యవహారం రగులుతూండగానే సంజయ్ కేసు పెట్టడం.. పోలీసులు అరెస్టు చేయడం జరిగిపోయాయి.
సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలాంటి వారు. ఆయన అధికారికంగా కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ కేటగిరీ కిందకే వస్తారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై చేసిన దాడిగానే… కాంగ్రెస్ చూస్తోంది. అందుకే పాడి కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఆయన గతంలో జూబ్లిహిల్స్ పోలీసులపై కూడా దౌర్జన్యం చేశారు. అరికెపూడి గాంధీ ఇంటిపైకి కూడా వెళ్లారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఇష్యూనూ కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.