పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఈ సారి కూడా జైలుకు పంపలేకపోయారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ తీసుకు వచ్చి కోర్టులో హాజరు పరిచినా అన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావడంతో రిమాండ్ రిపోర్టును కొట్టివేసిన జడ్జి బెయిల్ ఇచ్చారు. దాంతో కౌశిక్ రెడ్డి విడుదలయ్యారు. ఇలా కౌశిక్ రెడ్డిని పలుమార్లు అరెస్టు చేయడం.. ఆయన రిమాండ్ కు వెళ్లకుండానే వెనక్కి రావడం ఇది నాలుగోసారి. గతంలో హైదరాబాద్లో జరిగిన ఘటనల్లోనూ ఇలాగే బయటకు వచ్చారు.
పోలీసులు రిమాండ్ కు పంపించడంలో విఫలం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పండుగ పూట డెకాయిట్ నో, టెర్రరిస్ట్ నో అరెస్ట్ చేసినట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్టు చేశారని.. పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఎలా వ్యవహరించాలో అనేదానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీకి హరీష్ రావు కోరారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలన్నారు.
కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయని.. రేవంత్ రెడ్డి సీఎం కాక కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదుని.. అన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు పెట్టినవేనన్నారు. కలెక్టర్ ఆహ్వానం మేరకు కౌశిక్ రెడ్డి మీటింగ్ కు వెళ్లారని హరీష్ గుర్తుచేశారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి, బిఆర్ఎస్ పార్టీ బట్టలిప్పుతా అని సంజయ్ అన్నారని.. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదన్నారు. దీనికి మూడు కేసులు పెడతారా. ఒక సంఘటన మీద ముగ్గురు వేర్వేరు ఫిర్యాదులు తీసుకుని కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఒక్కరోజైనా కౌశిక్ రెడ్డిని జైల్లో పెట్టాలని చూస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.