ఆంధ్రలో సంక్రాంతి ఎప్పటిలాగే జరుగుతోంది. పండగ అంటే కోడి పందేలు అనుకున్న వారు కోడిపందేలు ఆడుకుంటున్నారు. కుటుంబంతో గడపాలని అనుకున్నవారు అలాగే చేస్తున్నారు. స్నేహితులతో ఎంజాయ్ చేయాలనుకున్నవారు అదే చేస్తున్నారు. ఇదంతా ప్రతి పండగుకూ కనిపించేదే. కానీ గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఏపీలో సంక్రాంతి పండుగులకు మిస్ అయింది ఒక్కటే.. అది తాడేపల్లిలో జగన్ సంక్రాంతి సంబరాలు.
సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ సంక్రాంతిని ఇంటికి పిలిపించుకునేవారు. ఎలా అంటే.. తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తిరుమల శ్రీనివాసుడి గుడి సెట్టింగ్ వేయించుకునేవారు. ఇలాంటి పనులు చేయడంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందు ఉంటారు. ఆయనే జగన్ దంపతులు ఏమనుకుంటున్నారో తెలుసుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసేస్తారు. ఇలా తిరుమల గుడి సెట్టింగ్ తోపాటు పూజారుల్ని కూడా పెట్టేసి కథ నడిపిస్తారు. ఇక పంచెలు కట్టుకుని జగన్ నులక ముంచం మీద కూర్చుంటే… ఆస్థాన విద్వాంసులు వచ్చి.. జగన్ దంపతుల్ని పొగుడూతూ పాడే పాటలు వైరల్ అయిపోయేవి. అతడు సినిమాలో టైటిల్ సాంగ్ ను జగన్ కు అన్వయించి ఓ విద్వాంసుడు పాడిన పాటను గుర్తు చేసుకోవడానికి వైసీపీ నేతలు కూడా భయపడుతూ ఉంటారు.
ఈ సారి అలాంటి సంక్రాంతి సంబరాలు మాత్రం మిస్ అయ్యాయి. ఆయన ఓడిపోవడంతో తాడేపల్లిలో అసలు సంక్రాంతి శోభ కనిపించడం లేదు. ఆయన ఇంటికి కాస్తంత అలంకరణ కూడా చేయలేదు. స్వయంగా జగన్ కూడా దేశం విడిచి వెళ్లిపోయారు. లండన్ పయనం కావడంతో ఇక్కడ తాడేపల్లిలో సంక్రాంతి.. సెట్టింగ్ అనే మాటకు చాన్స్ లేకుండా పోయింది.