తెలుగు చిత్రసీమకు సంక్రాంతి సీజన్ ఆయువు పట్టు. సినిమా క్యాలెండర్ సంక్రాంతి సీజన్‌తోనే మొదలవుతుంది. అక్కడ కనీసం రెండు హిట్లు పడితే ఆ యేడాదిని రెట్టించిన ఉత్సాహంతో మొదలుపెట్టొచ్చు. యావరేజ్ సినిమాని సైతం, హిట్ చేసే సత్తా సంక్రాంతి సీజన్‌కే వుంది. అందుకే బడా స్టార్లు, పెద్ద నిర్మాతల ఫోకస్ సంక్రాంతిపై పడుతుంది. టాప్ హీరోల కెరీర్లో సంక్రాంతి సినిమాలు, హిట్లు కచ్చితంగా ఉంటాయి. అయితే వాళ్లలో సంక్రాంతి హీరో అనిపించుకొన్నది మాత్రం బాలకృష్ణే.
బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ పై గురి ఎక్కువ. బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తోందంటే – కచ్చితంగా హిట్టే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోతారు. బాలయ్య కెరీర్లో దాదాపు 20 సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. వాటిలో హిట్లు, సూపర్ హిట్లే ఎక్కువ. భార్గవ రాముడు, ఇనస్పెర్టర్ ప్రతాప్, వంశానికొక్కడు, పెద్దన్నయ్య, నరసింహనాయుడు, లక్ష్మీనరసింహా, గౌతమి పుత్ర శాతకర్ణి, వీరసింహారెడ్డి.. ఇవన్నీ సూపర్ హిట్లే. ఇందులో నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్టు. తాజాగా ‘డాకూ మహారాజ్’తో తాను కింగ్ ఆఫ్ సంక్రాంతి అని మరోసారి నిరూపించుకొన్నాడు. ఈసారి పొంగల్ కి 3 సినిమాలొచ్చాయి. వాటిలో ‘డాకూ’దే డామినేషన్. రివ్యూల పరంగా, వసూళ్ల పరంగా ఈ మూడు సినిమాల్లో ‘డాకూ’దే టాప్ పొజీషన్.
ఈ సీజన్లో ఇన్ని హిట్లు కొట్టిన హీరో ఇంకెవ్వరూ లేరు. అయితే కొన్ని సీజన్లు బాలయ్య అభిమానులకు పీడకల మిగిల్చాయి. బాలయ్య కెరీర్లో కొన్ని మర్చిపోలేని డిజాస్టర్లు.. ఒక్క మగాడు, ఎన్టీఆర్ బయోపిక్, పరమవీరచక్ర చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. కాకపోతే.. ఫ్లాపుల కంటే, హిట్లే ఎక్కువ. అందుకే బాలయ్యే సంక్రాంతి కింగ్. అందుకే నిర్మాతలు కూడా బాలయ్య సినిమా అంటే సంక్రాంతికి విడుదల చేస్తే బెటర్ అని నిర్మాతలూ ఫిక్సయిపోతున్నారు. ప్రతీ సంక్రాంతికి బాలయ్య సినిమా రిలీజ్ అవ్వడం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. మరి 2026 సంక్రాంతికి బాలయ్య ప్లాన్ ఏమిటో?!