సంప్రదాయేతర ఇంధన విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ఏపీ పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. అయితే వాటి వల్ల సామాన్య ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు. రాష్ట్రానికి ఆదాయం… కొంత మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ అదే గ్రీన్ ఎనర్జీతో ప్రతి కుటుంబానికి మేలు చేయవచ్చు. ఆ కాన్సెప్ట్ ను ఇప్పుడు చంద్రబాబు విస్తృతంగా అమలు చేయాలని అనుకుంటున్నారు.
సోలారు ఎనర్జీతో ఇంటికి అవసరమైన విద్యుత్ ను సమకూర్చుకోవడమే కాదు ఇంకా ఎక్కువ ఉంటే.. దాన్ని గ్రిడ్‌కు మళ్లించగలిగే కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నారు. కుప్పంలోఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోనూ ఇదే పద్దతిలో ముందుకెళ్తున్నారు. నిజానికి సోలారు యూనిట్ పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అతి తక్కువగా వచ్చేలా సబ్సిడీ ఇవ్వాలనుకుంటోంది. దీని వల్ల కరెంట్ చార్జీలు మిగిలిపోతాయి. అంతే కాదు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది.
కరెంట్ చార్జీలు అనేవి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఇవి సామాన్య మధ్యతరగతికి భారమే. ఆ ఖర్చులు మిగిలితే ఇతర అవసరాలకు ఆ డబ్బులు వాడుకోవచ్చు. ఎలా చూసినా ఓ సగటు మధ్యతరగతి కుటుంబానికి నెలకు వెయ్యి రూపాయల వరకూ బిల్లు వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే సోలార్ యూనిట్లను తక్కువఖర్చుతో ఏర్పాటు చేసుకుంటే.. ఆ మొత్తం మిగలడంతో పాటు ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఇది వర్కవుట్ అయితే గేమ్ ఛేంజర్ అవుతుంది. వచ్చే పదేళ్ల కాలంలో విస్తృతంగా ఈ సోలార్ స్కీమ్స్ ను అమల్లోకి తెస్తే.. ప్రజలందరికీ ఆదాయం పెంచినట్లే అనుకోవచ్చు.