ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో. తనపై దాఖలైన ఏసీబీకేసును క్వాష్ చేయని హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేటీఆర్కు గట్టి షాక్ తగిలింది. ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకునేది లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హాజరయ్యారు. కేటీఆర్ తరపున సిద్దార్థ దవే తన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించడంతో పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని సిద్దార్థ ఇవే కోరారు. కానీ తెలంగాణ ప్రభుత్వ తరపు లాయర్ అంగీకరించలేదు. దాంతో పిటిషన్ డిస్మిస్ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
తనకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటానని కేటీఆర్ ప్రకటించారు. క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో తన పై కేసు విషయంలో కేటీఆర్ ఇక విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. గురువారం ఈడీ ఎదుటహాజరు కానున్నారు. క్వాష్ విషయంలో న్యాయపరమైన పోరాటం పొరపాటు అని నిపుణులు చెబుతూ వస్తున్నా… కేటీఆర్ మాత్రం క్వాష్ విషయంలో సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఈ క్రమంలో కేటీఆర్ కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు కూడా చెప్పినట్లయిందన్న వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేసు నమోదు అయినప్పటి నుండి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు కేటీఆర్. సీఎంపై దూషణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ కు న్యాయపరమైన అన్ని అవకాశాలు ముగిసిపోయాయి. ఇప్పుడు అరెస్టు చేసినా ప్రజల నుంచి స్పందన రావడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ ఊరట దక్కలేదు కాబట్టి ఆయన ప్రమేయం ఉంటుందని ఎక్కువ మంది అనుకునే అవకాశం ఉంది.