మంచు మనోజ్ ఎంబీ యూనివర్శిటీ లోకి మంచు మనోజ్ ను రాకుండా చేసేందుకు మోహన్ బాబు, విష్ణు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోర్టు ఆర్డర్స్ కూడా ముందు చూపుగా తెచ్చుకున్నప్పటికీ.. మంచు మనోజ్ ను లోపలికి అనుమతించక తప్పలేదు. తాతయ్య, నాన్నమ్మలకు నివాలి అర్పించేందుకు వచ్చానని .. గొడవలు చేయడానికి రాలేదని… నివాళి అర్పించిన తర్వాతనే వెళ్తానని మనోజ్ పట్టుబట్టారు. చివరికి పోలీసులు దగ్గరుండి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా లోపలికి రావాలనుకున్న మనోజ్ అనుచరులకు.. యూనివర్శిటీ బౌన్సర్లకు మధ్య గొడవలు జరిగాయి. దీంతో లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
యూనివర్శిటీ ఒకరి సొత్తు కాదని అభివృద్ధికి అందరి సహకారం ఉందని మనోజ్ స్పష్టం చేశారు. రెండు రోజుల నుంచి మనోజ్ తిరుపతి పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్నారు. రంగంపేటలోని తన మిత్రులతో పాటు యూనివర్సిటీలోని కొన్ని విద్యార్థి సంఘాలు కూడా మనోజ్ కు సపోర్టుగా ఉన్నాయి.మనోజ్ కోసం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మనుషుల్ని తీసుకొొచ్చి వాటిని తీసేయించారు. ఈ అంశంపై మనోజ్ మండిపడ్డారు. ట్రస్టుకు చెందిన ట్రాక్టర్లో రౌడీల్ని, బౌన్సర్లను తెచ్చారని.. తాను గొడవలు చేయడానికి రాలేదు కాబట్టి వదిలేశానన్నారు. లేకపోతే వారికి సమాధానం చెప్పడానికి తాను ఒక్కడిని చాలన్నారు.
తిరుపతికి వచ్చినప్పుడు మంచు మనోజ్ కు విద్యార్థులు స్వాగతం పలికారు.ర్యాలీ నిర్వహించారు. పలువురు అనుచరులు కూడా ఆయన వెంట ఉన్నారు. మొదట యూనివర్శిటీ లోకి వెళ్లాలని అనుకున్నప్పటికీ కోర్టు నోటీసులు ఇవ్వడంతో ఆయన నేరుగా నారా వారి పల్లె కు వెళ్లి లోకేష్ తో సమావేశమయ్యారు. తర్వాత రంగంపేటకు వెళ్లి జల్లికట్టు పోటీలను చూశారు. తర్వాత మళ్లీ మోహన్ బాబు యూనివర్శిటీవద్దకు వచ్చారు. లోకేష్ తో తమ వివాదాల గురించి మాట్లాడలేదని మనోజ్ స్పష్టం చేశారు.
కూర్చుని మాట్లాడుకోవడానికి భయం ఎందుకని .. యూనివర్శిటీలోని పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వారి కోసం తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. మోహన్ బాబు యూనివర్శిటీలో తన కంట్రిబ్యూషన్ ను కాదనలేరన్నట్లుగా మనోజ్ వ్యాఖ్యలు చేయడం.. లోపలికి ఎంట్రీఇవ్వడంతో తండ్రి, సోదరుడికి గట్టి సందేశం పంపించారని భావిస్తున్నారు.