చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాజకీయ నేతలు చెబుతూంటారు.. కానీ లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని తప్పు చేసిన ఎవర్నీ వదలదని అంటున్నారు. రెడ్ బుక్ పని చేయడం లేదని క్యాడర్ గగ్గోలు పెడుతున్న సమయంలో లోకేష్ ఈ కామెంట్స్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గ ముఖ్య టీడీపీ నేతలతో లోకేష్ సమావేశం అయ్యారు. వారితో ఈ వ్యాఖ్యలు చేశారు. లిక్కర్, ఇసుక స్కాముల్లో త్వరలో చాలా మంది అరెస్టు అవుతారని ప్రకటించారు.
ఏపీలో గత ప్రభుత్వ హాయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సీఐడీని అదేశిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. సీఐడీ కేసులు నమోదు చేశారు. మైనింగ్ వ్యవహారంలో వెంకటరెడ్డి అనే అధికారిని అరెస్టు చేశారు కానీ ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. ఇతర అరెస్టులు జరగలేదు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. సీఐడీ అంతర్గతంగా దర్యాప్తు చేస్తోంది. జే బ్రాండ్ల డిస్టిలరీల్లోనూ సోదాలు నిర్వహించారు. పలు సాక్ష్యాలు దొరికాయని.. ఆ జే బ్రాండ్లకు బినామీ ఓనర్లు వైసీపీ ముఖ్యనేతలేనని ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడలేదు.
వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోవడం లేదన్న అసంతృప్తి పార్టీ క్యాడర్ లో కనిపిస్తోంది. ఓ దుర్ఘటన ఆధారంగా వైసీపీ చేసిన రాజకీయం చూసి అయినా టీడీపీ నేర్చుకోవాలని అంటున్నారు. వైసీపీ హయాంలో తమను బయటకు రానివ్వలేదని ఇప్పుడు వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లుగా శవరాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు మంచితనం కారణంగానే ఇలా జరుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు అంటున్నారు.