కేటీఆర్ ఈడీ ఎదుట హాజరయ్యే విషయంలో బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఉదయం పది గంటలకు ఈడీ ఆఫీసుకు బయలుదేరుతారన్న సందేశాన్ని క్యాడర్ మొత్తానికి పంపారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున హడావుడిగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఉదయం పదిన్నరకు ఆయన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. గతంలో ఓ సారి నోటీసులు ఇస్తే వాయిదా కోరారు. ఈ సారి డుమ్మా కొట్టడానికి అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. అందుకే హాజరవక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
ఏసీబీ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలో ఆయన బలప్రదర్శన చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఏసీబీ విచారణ తర్వాత అరెస్టు చేస్తుందా లేదా అన్న ఉత్కంఠతో గడిపారు. చివరికి అరెస్టు చేయకపోవడంతో.. కేటీఆర్ కు.. ఘనస్వాగతం పలికారు. తెలంగాణభవన్ లో సీఎం సీఎం అంటూ నినాదాలు ఇచ్చారు. విచారణకు వెళ్లి వచ్చినందుకే అంత హడావుడి ఎందుకబ్బా అన్న డౌట్ సామాన్యలకు వచ్చింది. అయితే ఈ సారి ఈడీ విచారణకు కూడా అంతే హడావుడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈడీ అధికారులు అరెస్టు చేస్తారా లేదా అన్నదానిపై బయటకు పంపే వరకూ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది. అయితే అరెస్టు చేయరని బీఆర్ఎస్ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. చేస్తే గీస్తే ఏసీబీ చేస్తుంది కానీ ఈడీ చేయదని అనుకుంటున్నారు. ఈడీ అరెస్టు చేస్తే మాత్రం కనీసం నాలుగు నెలలు అయినా జైల్లో గడపాల్సి వస్తుందన్న ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో ఉంది.