భారత రాష్ట్ర సమితికి ఇవి అసలు పెద్ద సమస్యలే కాదని తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీ దెబ్బలు కూడా తిన్నామని సులువుగా గట్టెక్కుతామని ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ధైర్యం నింపడానికి ఆయన అలా చెప్పారు కానీ.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్నంత సమస్యలు గతంలో 2009లో వైఎస్ఆర్ టార్గెట్ చేసినప్పుడు కూడా ఎదుర్కోలేదని అనుకోవచ్చు. వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదం జరగడానికి ముందు తెలంగాణ భవన్ ను తిరుగుబాటు నేతలు స్వాధీనం చేసుకుంటారేమోనని కేసీఆర్ అక్కడ నిద్రించాల్సి వచ్చింది. అదే రాజకీయం అత్యంత క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు నేరుగా అలాంటివి రావడం లేదు. కానీ.. అసలు పునాదుల మీద దెబ్బకొట్టే రాజకీయాలు నడుస్తున్నాయి. దాన్ని కేటీఆర్ గుర్తించారో.. గుర్తించనట్లుగా నటిస్తున్నారో ఆయనకే తెలియాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన సమయంలో కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితయ్యారు. ఆయన గురించి ప్రజలు మర్చిపోయేలా పరిస్థితి వచ్చింది. మొత్తంగా కేటీఆరే రాజకీయాలు నడుపుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనపై కేసుల వల పడుతోంది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ నిండా మునిగిపోయారు. ఇది లొట్టపీసు కేసు అని ఆయనకు ఆయన తీర్పు చెప్పుకుని సంతృప్తి పడుతున్నారు కానీ సుప్రీంకోర్టు వరకూ ఆయనకు ఎక్కడా రిలీఫ్ రాలేదు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేస్తే సుదీర్ఘ కాలం జైల్లో ఉండాల్సి ఉంటుంది. ఎదుకంటే న్యాయపరమైన అన్ని అవకాశాలు క్లోజ్ అయిపోయాయి. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. అరెస్టు చేస్తే.. ఆయనకు బెయిల్ ను దర్యాప్తు సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. పైగా క్వాష్ పిటిషన్లు కొట్టేసిన ప్రభావం ఉంటుంది.
కవితను ఈడీ అరెస్టు చేసినపుడు ప్రజల్లో కనీస మాత్ర స్పందన లేదు. పార్టీ పరంగా ఆందోళనలు చేయాలని అంతర్గతంగా పిలుపునిచ్చినప్పటికీ చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఖాయమని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అరెస్టు చేస్తే.. ప్రజా ఉద్యమం వచ్చిందని చెప్పడానికి కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.కానీ ఇప్పుడు వరుసగా జరిగిన ప్రచారంతో.. అదంతా చల్లబడిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కేటీఆర్ తప్పు చేశాడని అందులో సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదన్న వాదన వినిపిస్తుంది. అంటే ప్రజలు కన్విన్స్ అవుతారు. బీఆర్ఎస్ ఆందోళనలు ప్రజల్లోకి వెళ్లవు.
ఓ వైపు తన ఇద్దరు బిడ్డలు ఒకరి తర్వాత ఒకరు జైలుకెళ్లడం కేసీఆర్కు మానసిక వేదన కల్పిస్తుంది. కవిత చాలా కాలం జైల్లో ఉన్నా ఆయన ఏమీ చేయలేకపోయారు. కనీసం పరామర్శించలేకపోయారు. ఇప్పుడు కేటీఆర్ జైలుకెళ్లే పరిస్థితి ఉంది. దీంతో ఆయన ధైర్యంగా ఉండే అవకాశాలు లేవని.. మానసికంగా కుంగిపోతారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉనికి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి కేటీఆర్ అనంతర నాయకత్వం సిద్ధం కావాల్సి ఉంది.