తెలుగుదేశం పార్టీని కార్యకర్తల పార్టీగా చెప్పుకుంటారు. లీడర్లు పార్టీని వీడిపోతారు కానీ కార్యకర్తలు మాత్రం పార్టీతోనే ఉంటారు. ఇప్పుడు ఆ కార్యకర్తల బేస్ టీడీపీకి కోటి మందికి చేరింది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే సభ్యత్వం నమోదు ఈ సారి రికార్డు స్థాయిలో నమోదు అయింది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి రెండేళ్లకోసారి సభ్యత్వం నిర్వహిస్తున్నారు..కానీ ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటి సారి.
నారా లోకేష్ పార్టీ సభ్యత్వం కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మానిటర్ చేశారు. చాలా నియోజకవర్గాల్లో లక్షకుపైగా సభ్యత్వాలు అయ్యాయంటే చిన్న విషయం కాదు. టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలో సభ్యత్వ పుస్తకాలను పంపేవారు. వాటిని నింపడానికి బద్దకించి చాలా మంది పక్కన పడేశారు. అయితే నకిలీ సభ్యత్వాలు పెద్ద ఎత్తున నమోదు చేసేవారు. సభ్యత్వం రుసుంను తామే కట్టేవారు. ఇప్పుడు సభ్యత్వం తీసుకోవడానికి ఓటర్ కార్డు నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. సభ్యత్వం తీసుకునేవారు ఖచ్చితంగా ఓటర్ అయి ఉంటాడు.
తెలంగాణలోనూ టీడీపీ కార్యకర్తల సంఖ్య పదిహేను లక్షలుగా నమోదు అయింది. అక్కడ యంత్రాంగం దాదాపుగా లేదు. అయినా పార్టీపై అభిమనంతో ఆన్ లైన్ లో సభ్యత్వం తీసుకునే వాళ్లే ఎక్కువ. మొత్తంగా టీడీపీ ని కార్యకర్తలు తమ భుజంపై మోస్తున్నారు. వారి సంక్షేమాన్ని.. రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ నాయకత్వం ప్రయారిటీగా తీసుకుని పని చేస్తోంది. ఓ రాజకీయ పార్టీ ఇంత క్రమబద్దంగా పని చేయగలగడం.. ప్రజాస్వామ్య గొప్పతనం. ఇలాంటి పార్టీలే ఎక్కువ కాలం ప్రజల గుండెల్లో ఉంటాయి.