బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల గాయాలతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. ఆయనపై దొంగతనానికి వచ్చిన దుండగులు దాడి చేశారని చెబుతున్నారు. కానీ అది నిజం కాదని అందరికీ తెలుసు. సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి ఎవరైనా ఓ వ్యక్తి అంత తేలికగా చొరబడే అవకాశం ఉండదు. చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. అందుకే ఏదో జరిగిందన్న అభిప్రాయం బలంగా ఉంది.
సైఫ్ అలీఖాన్, హీరోయిన్ కరీనా కపూర్ భార్యభర్తలు. అంతా బాంద్రాలోని నివాసంలో కలిసే ఉంటారు. వీరి ఇంట్లో పని చేసేవారు చాలా మంది ఉంటారు. వారిలో ఎవరైనా ఈ దాడి చేశారా అన్నది బయటకు రావాల్సి ఉంది. కత్తిపోట్లు బలంగా ఉండటంతో సైఫ్ ను అత్యవసరంగా లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంత వరకూ అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ దాడి గుర్తు తెలియని దుండగులు చేసే అవకాశం లేదని తెలిసిన వాళ్లే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు వచ్చిన బెదిరింపుల కారణంగా బాలీవుడ్ టెన్షన్ లో ఉంది. ఇలాంటి సమయంలో సైఫ్ పై దాడి మరింత సంచలనం అయింది. క్రికెటర్ పటౌడీ, షర్మిలా ఠాగోర్ సంతానం అయిన సైఫ్ అలీ ఖాన్.. బాలీవుడ్ లో ప్రతిభావంతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు . దేవరలో కూడా నటించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఈ కేసు గురించి గురువారం వెల్లడించే అవకాశం ఉంది.