తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అక్రమ కేసులకు గురైన వారి వివరాలన్నీ సేకరించారు. ఇప్పటికి ఏడు నెలలు అయింది. వారి అక్రమ కేసులను ఇంకా ఎత్తేసే చర్యలు ఎక్కడి వరకు వచ్చాయో తెలియదు. ఇటీవల చంద్రబాబు కూడా ఒక్క సంతకం తో అన్ని కేసులు తీసేస్తామని ప్రకటించారు. కానీ ఆయా కేసులు ఎదుర్కొంటున్న వారు మాత్రం.. విముక్తి ఎప్పుడు అని ఎదురు చూస్తూనే ఉన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేసుల విప్లవం నడిచింది. స్వయంగా చంద్రబాబు మీదే పాతిక కేసుల వరకూ పెట్టారంటే.. ఇక కిందిస్థాయిలో కార్యకర్తలపై ఎలాంటి ఒత్తిడి ఉండేదో చెప్పాల్సిన పని లేదు. గీతాంజలి అనే మహిళ అనుమానాస్పద మృతిని సోషల్ మీడియా వేధింపులుగా మార్చి.. టీడీపీ కార్యకర్తల్ని అరెస్టు చేశారు. కొంత మంది టీడీపీ కార్యకర్తల్ని .. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారిని అరెస్టులు చేసి వారిపై చేయకూడనంతటి తప్పుడు ప్రచారం చేశారు. ఇలాంటి కేసులు దాదాపుగా మూడు వేలు ఉంటాయని అంచనా.
టీడీపీ గెలిచిన వెంటనే..కేసుల వివరాలన్నీ సేకరించారు. కానీ ఏడు నెలలుగా ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందన్నది క్లారిటీ లేదు. కేసుల ఎత్తివేత అంత తేలిక కాదు. కానీ చాలా మార్గాలున్నాయి. మరోసారి టీడీపీ కార్యకర్తలు ఇబ్బంది పడకుండా కేసుల్ని ఎత్తివేయాల్సి ఉంది. ఆ దిశగా జరుగుతున్న చర్యలపై కేసుల పాలయినా వారికి అయినా సమాచారం ఉంటే.. సంతృప్తిగా ఉంటారు. లేకపోతే సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది.