రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్ ఆఫర్లు అంటే మోసమే అన్న అభిప్రాయం ఉంది. మూడు, నాలుగేళ్ల కిందట ఈ ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో డబ్బులు వసూలు చేసిన కంపెనీలు ఇప్పుడు చేతులెత్తేస్తున్నాయి. దీంతో అప్పట్లో డబ్బులు కట్టిన వాళ్లు పూర్తి స్థాయిలో నష్టపోయారు. బిల్డర్లపై కేసులు పెట్టి తాము స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అటు కూడబెట్టుకున్న డబ్బులూ పోతాయి.. ఇటు ఆశతో కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి.కానీ న్యాయం మాత్రం జరుగుతుందన్న నమ్మకం ఉండదు.
ఈ ప్రీలాంచ్ ఆఫర్ల మోసాల విషయంలో రెరా కూడా ఏమీ చేయలేకపోతోంది. రెరా అనుమతి లేకుండా ప్రీలాంచ్ ఆఫర్లు ఇవ్వకూడదు. అసలు రెరా ప్రీ లాంచ్ ఆఫర్లకు పర్మిషన్ ఇవ్వదు. కానీ కోకాపేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఇప్పటికే ప్రీలాంచ్ సేల్స్ చేసింది. ఆ సంస్థపై రెరా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మరో జాతీయ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థ శోభా డెవలపర్స్ కూడా ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రారంభించింది. రెరా అనుమతితో ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయిస్తే.. బ్బంది ఉండదు. రెరా నిబంధనల్ని తుంగలో తొక్కేసి.. ముందస్తు అమ్మకాల్ని చేయడం కరెక్టు కాదని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.
బడా సంస్థలు డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేయకపోచ్చు కానీ.. నిబంధనలు అందరికీ ఒక్కలాగే ఉండాలని.. రూల్స్ అంటే రూల్స్ అన్నట్లుగా అమలు చేస్తేనే వ్యవస్థలు సరిగ్గా పని చేసినట్లని అంటున్నారు. రెరా అనుమతి ఉన్న వాటిని కొనుగోలు చేస్తేనే.. వినియోగదారులు సేఫ్ గా ఉంటారు. బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.