హైదరాబాద్ నానక్‌రాం గూడ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న సైకిల్ ట్రాక్ మట్టిరోడ్డులా పగుళ్లిస్తోంది. భారీ ఖర్చుతో దాదాపుగా ఇరవై మూడు కిలోమీటర్ల నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ప్రకటించారు.కానీ రెండేళ్లకే అది పగుళ్లిచ్చి సైక్లింగ్ కు పనికి రాకుండా పోతోంది. మొత్తం సైకిల్ ట్రాక్ ను 23 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఒక్కో కిలోమీటర్‌కు రూ. 3 కోట్ల 91 లక్షలు ఖర్చు చేశారు.
అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో సైక్లింగ్ ట్రాక్ తో పాటు పైన సోలార్ రూఫ్ నిర్మించామని కేటీఆర్ చెప్పారు. అట్టహాసంగా ప్రారంభించారు. అయితే. ఇంత పెట్టుబడి పెట్టిన ఈ సైక్లింగ్ ట్రాక్ ఇప్పుడు పగుళ్లిస్తోంది. వట్టినాగుల పల్లి వల్ల నడవడానికి కూడా అనుకూలంగా లేనంతగా పగుళ్లిచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ట్రాక్ మొత్తం ఇలాంటి పగుళ్లు ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రాక్ మెట్రో వాటర్ బోర్డు వేసిన పైప్ లైన్ల మీద నిర్మించారు. అయితే నిర్మాణం సమయంలో.. పైప్ లైన్ గుంతలు సరిగ్గా పూడ్చకపోవడంతో.. కుంగిపోతోందని అందువల్లనే పగుళ్లు వస్తున్నాయని భావిస్తున్నారు. పొరపాటున పైప్ లైన్‌కు ఎక్కడైనా పగుళ్లు వస్తే.. వాటర్ లీక్ అయితే సైక్లింగ్ ట్రాక్ నిరుపయోగంగా మారుతుందన్న ఆందోళన కనిపిస్తోంది.
ఈ సైక్లింగ్ ట్రాక్ వల్ల ఎంత మందికి ఉపయోగమో ఎవరూ తేల్చలేకపోతున్నారు. సైక్లింగ్ చేసే వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. పక్కనే ఔటర్ చాలా బిజీగా ఉంటుంది. సైక్లిస్టులు తక్కువగా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ అనేది ట్రాఫిక్ పరంగా చూస్తే మంచి ఐడియా కాదన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ హడావుడిగా దీన్ని పూర్తి చేయించి ఓపెనింగ్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా క్యాంపెయినర్లు విస్తృతంగా టిక్ టాక్‌లు చేసి.. వైరల్ చేశారు. కానీ ఇప్పుడు ట్రాక్ నాణ్యతా ప్రమాణాలు బయటపడుతున్నాయి.