కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల పంతం కారణంగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగకుండా నిలిచిపోయాయని బీజేపీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ లేవనెత్తిన అంశాల మీద తాము చర్చకు సిద్దమని చెపుతున్నప్పటికీ, తమ మంత్రుల రాజీనామాకు మొండిపట్టు పడుతూ పార్లమెంటు సమావేశాలను అడ్డుకోవడాన్ని బీజేపీ తప్పు పడుతోంది. ఆ తల్లీ కొడుకులిద్దరూ పార్లమెంటులో బలప్రదర్శన చేసి తమ సత్తా చాటుకోవాలని చూస్తున్నారని కానీ వారు చేస్తున్న ఈ పనిని చూసి యావత్ దేశప్రజలు వారిని అసహ్యించుకొంటున్నారని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో వ్యవహరిస్తున్న తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని, స్పీకర్ సుమిత్ర మహాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ సభ్యులు సభకు ఏవిధంగా ఆటంకం కలిగిస్తున్నారో దేశప్రజలందరూ చూసేలా అన్ని టీవీ చానళ్ళలో చూపించాలని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ నిన్న సభలో వ్యవహరించిన తీరు చూస్తే బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు నిజమేనని దృవీకరిస్తున్నట్లుంది. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి అయిపోయిందని, దానికి ప్రతిపక్ష పార్టీలేవీ మద్దతు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలతో అప్రమత్తమయిన రాహుల్ గాంధీ సభలో తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగత్ రాయ్, సమాజ్ వాది పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్, ఆమాద్మీ సభ్యుడు భగవంత్ మాన్ వద్దకు స్వయంగా వెళ్లి వారి డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని, కనుక వారు కూడా తమకు మద్దతుగా సభలో నిరసనలు తెలపాలని కోరారు.
రాహుల్ గాంధీ ఇటీవల అనంతపురం జిల్లా పర్యటనకి వచ్చినప్పుడు వైకాపా మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న డిల్లీలో ఒక్కరోజు దీక్ష చేసినప్పుడు రాష్ట్ర విభజన చేసి రాష్ట్రానికి ఈ దుర్గతి పట్టించారంటూ సోనియా, రాహుల్ గాంధీల మీద తీవ్ర విమర్శలు చేసారు. కానీ రాహుల్ గాంధీ అవేమీ పట్టించుకోనవసరం లేదన్నట్లుగా సభలో వైసిపి సభ్యుడు మేకపాటి వద్దకు కూడా వెళ్లి వైకాపా సభ్యులను కూడా తమకు మద్దతుగా సభలో నిరసనలు తెలియజేయాలని, అందుకు ప్రతిగా ప్రత్యేక హోదా అంశంలో తమ కాంగ్రెస్ సభ్యులు వారికి మద్దతుగా నిరసనలు తెలియజేస్తారని చెప్పడం గమనిస్తే రాహుల్ గాంధీ లోక్ సభ కార్యక్రమాలు జరగకుండా అడ్డుపడేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నారో అర్ధమవుతోంది.
సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఓటమితోనే ఆ తల్లీ కొడుకుల పాలన పట్ల దేశప్రజలు విముఖత చూపినట్లు స్పష్టమయింది. ఆ తరువాత జరిగిన వివిధ రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో దానిని మరొక్కసారి దృవీకరించినట్లయింది. ఆ తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేప్పట్టబోతే పార్టీలోనే అసమ్మతి రాగాలు వినిపించడంతో రాహుల్ గాంధీకి అది చాలా అవమానకరంగా మారింది. ప్రధానమంత్రి అవుతాడనుకొంటే కనీసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా అవలేకపోయాడని ప్రతిపక్షాలు, మీడియా కోడై కూస్తుంటే ఆ అవమానకర పరిస్థితిని తట్టుకోలేకనే పార్టీపై అలిగి కీలకమయిన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో రెండు నెలలు కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకి శలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ తన కనుసన్నలలో నడుస్తుందని తల్లి నుండి హామీని పొందిన తరువాతనే అతను స్వదేశం తిరిగి వచ్చారు. అంటే తన పార్టీని తనే బ్లాక్ మెయిల్ చేసుకొన్నట్లుందని మీడియాలో వార్తలు వచ్చాయి.
తిరిగి వచ్చిన తరువాత తన పార్టీలో సీనియర్ నేతలు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా ‘తనేమీ బలహీనుడిని కానని… మోడీ ప్రభుత్వాన్ని డ్డీ కొనగలిగే దైర్యం…పార్టీని ఏకత్రాటిపై నడిపించగల గొప్ప నాయకత్వ లక్షణాలు తనలో ఉన్నాయని’ నిరూపించుకొనేందుకే ఆయన పార్లమెంటుని స్తంభింపజేస్తున్నట్లుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో యావత్ దేశప్రజల దృష్టిలో ఆయన మరింత చులకనయ్యే ప్రమాదం ఉందనే సంగతి ఆయన గ్రహించకపోవడం, పార్టీలో సీనియర్ నేతలయినా ఆ విషయం ఆయనకి చెప్పే సాహసం చేయకపోవడం విచిత్రమే. వీలుచిక్కినప్పుడల్లా రాజకీయాలలో నైతిక విలువలు, నీతి నిజాయితీ, పార్టీ పద్దతులలో మార్పు, ప్రక్షాళన గురించి అనర్గళంగా ప్రసంగించే రాహుల్ గాంధీ ఇప్పుడు సభలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే, ఆయన చెప్పే మాటలకి చేతలకి చాలా వ్యత్యాసం ఉందని అర్ధమవుతోంది. కాంగ్రెస్ రధం ఇప్పటికే ఇప్పటికే పూర్తిగా క్రుంగిపోయుంది. దానిని బయటకు తీసి మరమత్తులు చేసుకొని మళ్ళీ యుద్దానికి సన్నధం చేయవలసిన రధసారధి రాహుల్ గాంధీ ఇప్పుడు శల్యసారధ్యం చేస్తున్నారు. కనుక కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటో ఆ రధంలో కూర్చొన్న పార్టీ నేతలకే బాగా తెలిసుండాలి.