కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు రూ. 17వేల కోట్లు నిర్వహణ మూలధనం కింద సమకూర్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తే ప్రైవేటీకరణపై పూర్తి స్థాయిలో వెనుకడుగు వేసినట్లే అనుకోవచ్చని భావిస్తున్నారు. ఉత్పత్తి మెరుగుపడిన తర్వాత సెయిల్ లో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. అప్పట్లో ప్రభుత్వం రాజకీయం చేసింది. కేంద్రం వద్ద పట్టుబట్టలేదు. ఫలితంగా ప్రైవేటీకరణ ప్రక్రియ వేగంగా సాగింది. అయితే ప్రభుత్వం మారే సరికి పూర్తిగా ప్రాధాన్యాలు మారిపోయాయి. టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణకు అంగీకరించే అవకాశం లేకుండా పోయింది. దాంతో కేంద్రం.. ప్లాంట్ ను నిలబెట్టే చర్యలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా నిర్వహణ మూలధనం ఇస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ కు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ లో స్టీల్ ప్లాంట్ భాగం.అయితే తెలుగు ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్. అందుకే టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ వద్దని అంటోంది. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూండటంతో.. ప్రైవేటీకరణ జరగనివ్వబోమన్న మాటకు కట్టుబడి చర్యలు తీసుకుంటున్నారు