“అందరూ కష్టపడిన దాన్ని నాశనం చేయడానికి పై స్థాయిలో ఉన్న ఒక్క తెంపరితనం ఉన్న వ్యక్తి చాలు” అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే కింది స్థాయిలో ఎవరు ఎంత గొప్పగా పని చేసినా ఫైనల్‌గా దాన్ని విజయ తీరాలకు చేర్చాల్సిన వ్యక్తి మూర్ఖుడో.. మూఢుడో అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. అప్పటి వరకూ పడిన కష్టం కాదు ఆ తర్వాత కష్టపడినా ఫలితం దక్కనంత నష్టపోవచ్చు. ఇప్పుడు అమెరికన్లకే కాదు.. ప్రపంచం మొత్తం ఇదే భయం 20వ తేదీన అగ్ర రాజ్య అధిపతిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ గురించి ఉంది. పదవి చేపట్టక ముందే ఆయన చేస్తున్న పిచ్చి చేష్టలు, వాటికి మద్దతుగా ఆయన పరివారం వేస్తున్న గెంతులు చూస్తూంటే..వింటూంటే మన బతుకుల్ని కూడా మనల్ని బతకనీయడు కదా అని ప్రపంచవ్యాప్తంగా జనం భయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా చేసే పనుల ప్రభావం ప్రపంచం మొత్తం ఉంటుంది.
అగ్రరాజ్యం అనే పేరుకు తగ్గట్లుగా హుందాతనం లేని ప్రెసిడెంట్
అగ్రరాజ్య పెద్దన్న ఎంత హుందాగా ఉండాలి ?. తాను బాగుడుతూ.. అందర్నీ బాగు పరచాలి. తానొక్కడు బాగుపడటం సాధ్యం కాదు. అందరితో పాటు తాను ఎదగాలి. అయితే ట్రంప్ మనస్థత్వం అలాంటిది కాదు. తాము మాత్రమే బాగుపడాలకునే మైండ్ సెట్. ఆయన నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఇందులోనే చాలా ద్వేషం నింపి మొదటి సారి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అమెరికాలో అమెరికన్లకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం అన్నది ఆయన కాన్సెప్ట్. అమెరికా అవకాశాల స్వర్గం కావడానికి… ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మేధో వలసే కారణం. ఎవరో ఎందుకు డొనాల్డ్ ట్రంప్ పుట్టుకతో అమెరికన్ కావొచ్చు కానీ ఆయన తల్లిదండ్రులు ఆ రకం అమెరికన్ సిటిజన్లు కాదు. అంత ఎందుకు ఆయనను నెత్తి మీద పెట్టుకుని గెలిపించిన ఎలాన్ మస్క్.. అమెరికా పౌరుడు ఎలా అయ్యాడు.. ఆయన దక్షిణాఫ్రికా నుంచి అమెరికా వయా కెనడా. అమెరికాలో అత్యంత ప్రతిభావంతులంతా పుట్టుకతో అమెరికన్లు కాదు. కానీ వారు ఆ దేశానికి సంపద సృష్టించారు. ప్రపంచ అగ్రదేశంగా నిలిపారు. ఈ సూక్ష్మాన్ని మర్చిపోకపోయినా తన రాజకీయం కోసం.. సొంత దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టి తొలి సారి గెలిచారు. విదేశీయుల్ని రానివ్వనని అమెరికన్లకే ఉద్యోగాలని అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చారు. వీసా రూల్స్ మార్చేశారు. అయితే ఆయన వల్ల నష్టమే ఎక్కువ అనుకున్నారేమో కానీ రెండో సారి గెలవనీయలేదు. కానీ ఆయన మూడో సారి ఎన్నికల్లో పోటీ చేసి రెండో సారి గెలిచారు. ఈ సారి విద్వేషం డోస్ మరింతగా పెంచారు. కారణం ఏదైనా అమెరికా ప్రజలు మహిళా అధ్యక్షురాల్ని ఎన్నుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. నాడు హిల్లరీ క్లింటన్ అయినా… నేడు కమలా హ్యారీస్ అయినా.. ఇద్దరూ ట్రంప్ కంటే.. వ్యక్తిత్వంలోఉన్నతులు. అమెరికాను అగ్రరాజ్యంగా నిలబెట్టేలా తమ పనితీరు హుందాగా ఉండేలా చూసుకునేవారు. కానీ డొనాల్డ్ ట్రంప్ కు అది లేదు. ఆయన వ్యవహారం అంతా నేలబారుగా ఉంటుంది. బంపర్ మెజార్టీ రావడంతో పాటు.. తిరుగులేని విధంగా చట్టసభల్లో ఆధిపత్యం ఉండటంతో ఆయనలోని మూర్ఖశిఖామణి మెల్లగా బయటకు వస్తున్నాడు. వైట్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందే మిత్ర దేశాలపై పంజా విసురుతున్నారు.
మిత్రదేశాలతో పరాచికాలు – అహంకారంతో విర్రవీగుతున్న వైనం
కెనడాను కలిపేసుకుంటామని ఆయన చేస్తున్న వికృత ప్రకటనలతో ఆ దేశం మండిపడింది. నిజానికి అమెరికా, కెనడా ప్రాణ స్నేహితులు. అలాంటి మిత్ర దేశంతో ఎవరైనా మీ దేశాన్ని కలిపేసుకుంటామని అనగలరా?. ఆ దేశ మ్యాచ్ ను.. అమెరికాలో కలిపేసి తన సొంత అకౌంట్లో పోస్టు చేయగలరా?. అదీ అమెరికా అధ్యక్షుడి నుంచి అలాంటి తెంపరితనాన్ని అసలు ఊహించగలమా?. కానీ ట్రంప్ చేసి చూపిస్తారు. పనామా కాలువను స్వాధీనం చేసుకోవడం.. గ్రీన్ ల్యాండ్ ను కొనేయడం లాంటి పిచ్చి పిచ్చి ప్రకటనలకు కొదవలేదు. ఇలా మిత్రదేశాలన్నింటితోనూ.. ఈ గోల ఎలా భరించాలి అనుకునేలా చేశారు. ఇక యుద్ధాలు ఆపేస్తానని ఆయన చెప్పిన మాటల్ని అమెరికన్లు నమ్మారేమో కానీ.. ఆయన తీరుతో ఇంకా మంటల్లో పెట్రోల్ పోస్తాడు కానీ.. ఆపే అవకాశం లేదని ఎవరికైనా అర్థమవుతుంది. పుతిన్ తో భేటీకి తహతహలాడిపోతున్నారు. గతంలో చైనాను బూచిగా చూపించేవారు. ఇప్పుడు పదవి చేపట్టిన తర్వాత ఆ దేశంపై దూకుడుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే గుబులు అందరికీ ఉంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందనేది మాత్రం నిజం. మరో పుతిన్ లా వ్యవహరిస్తూ పనామా కాలువను స్వాధీనం చేసుకోవడం లాంటివి జరిగితే.. గగ్గోలు రేగుతుంది. ఇక యుద్ధాలు ఆపాల్సింది పోయి కొత్తగా సృష్టిస్తే మూడో ప్రపంచయుద్ధానికి కారణం అవుతారు. ఆ ప్రమాదాన్ని ఎవరూ కాదనలేరు. ఓ వైపు అమెరికాను రిస్క్ లో పెట్టేసి మరో వైపు ప్రపంచాన్ని కూడా ఇబ్బంది పెట్టిన వారవుతారు. ట్రంప్ ఇలా ఇతర దేశాలతో కయ్యాలు పెట్టుకుంటూ పోవడమే కాదు.. తన దేశాన్ని కూడా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. తమ దేశంలోకి వచ్చే మేధోవలసను అడ్డుకోవాలని ఆయన అనుకుంటారు. తమ దేశానికి వచ్చి దండిగా జీతాలు తీసుకుంటున్నారని ఆయన బాధపడుతున్నారు కానీ.. వారు అక్కడే సంపద సృష్టి చేస్తున్నారని గుర్తించడం లేదు. హెచ్ వన్ బీ వీసాలు దగ్గర నుంచి గ్రీన్ కార్డుల వరకు.. డొనాల్డ్ ట్రంప్ కొత్త పాలసీలను తీసుకు రావాలని డిసైడయ్యారు. ఎలా చూసినా ఆ పాలసీలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పనక్కరలేదు. ఇప్పటికే H1B వీసాలు స్పాన్సర్ చేసే కంపెనీలకు అత్యంత భారం అయ్యేలా చేశారు. ఇక ముందు మరింత భారం చేయనున్నారు. ఆ స్కిల్స్ ఉంటే.. ఆయా కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇచ్చేవి. అక్కడ లేకనే ఇతర దేశాల నుంచి తెప్పించుకుంటున్నారు. అంతే కానీ తాము ఖర్చు పెట్టుకుని అమెరికాలో మనుషుల్ని డంప్ చేయాలని ఆయా కంపెనీలు కూడా అనుకోవు.
అమెరికాకు వలస వచ్చే వారిపై చిన్నచూపు – వారి వల్లే బాగుపడిన అమెరికా
ఏదైనా ఓ కంపెనీ అమెరికాలో ఓ కోటి రూపాయల జీతం ఇచ్చి ఎన్నారైను అమెరికా తీసుకెళ్లిందంటే.. అక్కడ అతని ప్రొడక్టివిటీ అంత కన్నా ఎక్కువ ఉండేలా చూసుకుంటుంది. అంటే .. అమెరికాలో అతను అంతకు మించి సంపద సృష్టి చేస్తారు. సంపాదించిన దాంట్లో అత్యదిక భాగం అమెరికాలోనే ఖర్చు పెడుతున్నారు. దీని వల్ల ఎవరికి లాభం ?. హెచ్ వన్ బీ వీసాలను పరిమితం చేస్తే.. అమెరికాకు నాణ్యమైన ఇంజినీర్లు దొరకని అప్పుడు చాలా సమస్యలు వస్తాయని ట్రంప్ .. రైట్ హ్యాండ్ లాగా మారిన ఎలాన్ మాస్క్ చెబుతున్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటా వినే రకం కాదు. ఆయన చేయాలనుకున్నది చేస్తారు. అందుకే అమెరికాలో హెచ్ వన్ బీ వీసాలను స్పాన్సర్ చేసిన వారంతా.. తమ ఉద్యోగులు అమెరికా బయట ఉంటే ఇరవయ్యే తేదీలో పు ఇచ్చేయాలని సందేశాలు పంపుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే.. హెచ్ వన్ బీ వీసా పొందిన వాళ్లంతా.. అమెరికాకు చేరుకుంటున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే ఆ వీసాల్ని రద్దు చేస్తే ఇక అమెరికాలోకి అడుగు పెట్టడం అసాధ్యం అవుతుంది. డొనాల్డ్ ట్రంప్ అలాంటి నిర్ణయం తీసుకోమన్న గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మనస్థత్వం అలాంటిదే. ఏదైమైనా పోని.. అమెరికా నష్టపోనీ.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని ఆయన కోరుకుంటారు. ఇప్పటి వరకూ చేసిన పనులు.. తీసుకున్న నిర్ణయాలు అలాంటివే. అందుకే బాబోయ్ ట్రంప్ అని అందరూ భయపడుతున్నారు. ప్రపంచ పెద్దన్నలా ఉండి.. అందరి బాగు కోసం పని చేయాల్సిన అమెరికా ఇప్పుడు.. స్వార్థపూరితంగా వ్యవహరించే వ్యక్తి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే.. తమ దేశం నుంచి చేసే ప్రతి ఎగుమతికి పన్నులు తక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓ పేద దేశం ఎలాంటి మనస్థత్వంతో ఉంటుందో అలాంటి మనస్థత్వంతో ఆయన ఆలోచిస్తున్నారు. తమ దేశానికి అవసరం అయితే.. ఆ వస్తువుల మీద పన్నులు తక్కువగానే వేస్తాయి ఏ ప్రభుత్వం అయినా. నిత్యావసరాల మీద.. ప్రజల జీవనానికి ఉపయోగపడేవాటి మీద.. అమెరికా నుంచి వస్తున్నాయి కదా అని ఎక్కువ పన్నులు వేయరు. అయితే ఇదంతా ఆలోచించేంత విశాలమైన మనస్థత్వం ఆయనకు లేదు కాబట్టే ఇప్పుడు ప్రపంచం అంతా అమెరికా వైపు ఉత్కంఠంగా చూస్తోంది.
ట్రంప్ పాలన వల్ల అమెరికానే కాదు ప్రపంచం కూడా ప్రభావితం !
డొనాల్డ్స్ ట్రంప్ ను చూసి అమెరికాతో పాటు ప్రపంచం అంతా ఎందుకు కంగారు పడుతోందంటే.. ఆయన టీం కూడా అలాంటి తెంపరితనంతో ఉన్న వారే కావడం. ఎలాన్ మస్క్ కు ఆయన వ్యాపారాలే ఆయనకు ముఖ్యం. ఆయన వ్యాపారాల కోసమే ట్రంప్ కుసపోర్టు చేశాడు. పెద్ద ఎత్తున డబ్బులు వెదజల్లాడు. ఆ విషయాన్ని నేరుగా అంగీకరిస్తాడు కూడా. ఆయన టీంలో ఇతరులు కూడా విపరీత మనస్థత్వం కలవారే. అందుకే.. అమెరికా వచ్చే నాలుగేళ్ల పాటు ఎలా ఉంటుందన్నది టెన్షన్స్ ప్రారంభమయ్యాయి. జనవరి ఇరవయ్యే తోదీన ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేస్తారు. ఆ రోజున ఆయన కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే తన టీమ్‌ను రెడీ చేసుకున్నారు. ఆ టీమ్ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన వెంటనే.. తీసుకునే నిర్ణయాలను బట్టే.. తర్వాత వచ్చే నాలుగేళ్లు ప్రపంచ గమనం ఆధారపడి ఉంటుంది. ఆయన తనకు ఎదురు లేని చక్రవర్తిని అనుకుంటే… ప్రపంచం ప్రమాదం గుప్పిట్లోకి వెళ్లిపోతుంది. అంతకు మించి అమెరికా దివాలా తీస్తుంది. అగ్రరాజ్యం హోదా కోల్పోతుంది. అలా జరిగితే.. ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఎవరు ఎన్ని దశాబ్దాలు కష్టపడినా.. దాన్ని విధ్వంసం చేయాలనుకుంటే.. ఎంతో సమయం అవసరంఉండదు. ట్రంప్ లాంటి వాళ్లు పైన ఉంటే.. ఊహించనంత వేగంగా పతనమైపోతారు. మళ్లీ కోలుకోలేరు. అందుకే ముంచినా.. తేల్చినా ట్రంపే అని అందరూ నిట్టూరుస్తున్నారు. అంతా మంచే జరగాలనికోరుకుందాం.. అంతకు మించి చేయగలిగిందేమీ లేదు.