మనమిద్దరం.. మనకిద్దరు అని కేంద్రం ఒకప్పుడు జనాభా నియంత్రణపై ప్రచారం చేసింది. తర్వాత ఇద్దరు కూడా తక్కువేనని ఒక్కరు చాలని చెప్పింది. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కనాలని చట్టాలు చేస్తామని పాలకులు అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకూ ముగ్గురు పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించిన ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరు పిల్లలు ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత వచ్చేలా చట్టాలు చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు లక్ష్యం… ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే.
జనాభా నియంత్రణ అనేది ఇప్పటి పరిస్థితులకు ఇక ఇమడదని తేలిపోయింది. అందుకే అందరూ జనాభా పెంచాలని అంటున్నారు. ముఖ్యంగా దక్షిణ భారత్ నుంచి ఈ డిమాండ్ ఎక్కువగా వస్తోంది. నిజానికి ఒక్క దక్షిణ భారత్ నుంచే కాదు.. దేశమంతా ఈ పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో చాలా దేశాల్లో ఏర్పడుతున్న జనాభా సంక్షోభం.. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు ఇండియాలో తగ్గిపోతున్న జననాల కారణంగా ఏర్పడబోయే పరిస్థితులపై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. జపాన్ నుంచి రష్యా వరకూ ఇప్పుడు మనుషులు ఎలాగూ పుట్టడం లేదు కాబట్టి రోబోల్ని అయినా రెడీ చేసుకుందామని ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే భారత్ కు ఇంకా అంత తీవ్రమైన సంక్షోభం రాలేదు. జనాభా నియంత్రణపై చేసిన నిర్లక్ష్యమే ఇప్పుడు ప్లస్ గా మారుతోంది. కానీ ఆలస్యంగా అవగాహన పెంచుకుని ఇప్పుడు జనాభాను నియంత్రిస్తున్నారు. ఫలితంగా భారత జనాభా కూడా రానున్న రోజుల్లో తగ్గిపోతోంది. చైనా ఇప్పుడు పని చేసే యువత లేక తంటాలు పడుతోంది. భారత్ కు ఆ పరిస్థితి వస్తే తట్టుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే యువతరాన్ని పెంచుకోవాలంటే.. పిల్లల్ని కనాలని అంటున్నారు. కానీ ఇప్పుడు వారిని పెంచడం పెద్ద టాస్క్ కాబట్టి ఎక్కువ మంది ఒకరితో సరి పెట్టుకుంటున్నారు. కనీసం ఇద్దర్ని కనాలని కేంద్రం కూడా త్వరలో క్యాంపెయిన్ స్టార్ట్ చేసినా ఆశ్చర్యం ఉండదన్న వాదన నిపుణుల నుంచి వినిపిస్తోంది.