బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై దాడి వ్యవహారంలో పోలీసులు చాలా క్లియర్ గా ఉన్నారు. దొంగ పది అంతస్తులు పైకి వచ్చాడు. దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అడ్డుకోవడంతో అతనిపై దాడి చేశాడు. తర్వాత ఎలా వచ్చాడో అలా పారిపోయాడు. ఓ సీసీ ఫుటేజీ కూడా రిలీజ్ చేశారు. అతన్ని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేకబృందాలను రంగంలోకి దింపారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అంతా పద్దతిగా జరిగిపోతోంది. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయనకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే అసలు ఏం జరిగిందో పోలీసులు చెబుతున్న వివరాలతో పోలిస్తే.. సినిమా ఫ్యాన్స్ రియలైజ్ కాలేకపోతున్నారు. ఎన్నో సస్పెన్స్ ధ్రిల్రర్స్ తీసిన బాలీవుడ్ లో జరిగిన ఈ ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ సెక్యూరిటీ ఉండే ఓ అపార్టుమెంట్ లోకి.. పదో అంతస్తులోకి ఓ దొంగ వెళ్లగలడా ?. వెళ్లినా అర్థరాత్రి నేరుగా తలుపులు తీసుకుని సైఫ్ ఇంట్లోకి చొరబడిపోగలడా?. ముందుగా పని మనిషి మీద దాడి చేశాడు. ఆమె అరుపులు విని సైఫ్ వస్తే.. తప్పించుకోవడానికి ఆయనపై దాడి చేసి పారిపోయాడని చెబుతున్నారు.
డ్రైవర్లు ఎవరూ అందుబాటులో లేరని కనీసం అంబులెన్స్ కు కూడా సమాచారం ఇవ్వకుండా ఆటోలో ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. సైఫ్ ను ఆస్పత్రికి తీసుకెళ్లింది పని మనిషితో పాటు ఆయన చిన్న కుమారుడని చెబుతున్నారు. కరీనా తర్వాత వచ్చారు. కరీనా ఇంట్లో ఉన్నారో లేదో స్పష్టత లేదు. వారిది సెలబ్రిటీ రేంజ్ కాబట్టి రకరకాల ఊహాగానాలు వస్తాయి. అయితే పోలీసులు మాత్రం ఇలాంటి వాటికి చాయిస్ ఇవ్వకుండా..నేరుగా ఒకే స్టోరీ చెబుతున్నారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునేందుకు నిర్మించిన మెట్ల ద్వారా దుండగుడు వచ్చాడని అక్కడ పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లేవని అంటున్నారు. ఆరో అంతస్తులో ఒక చోట ఫుటేజీ దొరికిందని అది రిలీజ్ చేశారు
సెలబ్రిటీల ఇళ్లల్లో ఏం జరిగినా.. నిజం మాత్రం ఎవరికీ తెలియదు. వారికే తెలుస్తుంది. కానీ ప్రజల్లో ఉండే ఆసక్తి మేరకు..దాన్ని చిలువలు పలువలుగా మీడియా, సోషల్ మీడియా ప్రచారం చేస్తూనే ఉంటుంది.