కేటీఆర్‌పై పెట్టిన కేసులను ప్రజలు నమ్ముతున్నారో లేదో సర్వే చేయించామని ఎనభై శాతం మంది నమ్మడం లేదని .. బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి మీడియాతో చెప్పారు. ఎంత మంది నమ్ముతున్నారు.. ఎంత మంది నమ్మడం లేదన్న విషయం పక్కన పెడితే ఈ కేసుల విషయంలో బీఆర్ఎస్ ఎంత టెన్షన్ పడుతుందన్నది తాము చేయించుకుంటున్న సర్వేల ద్వారానే అర్థమవుతుంది. ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు, కేటీఆర్ ప్రతి రోజూ గంటకోసారి చెబుతున్నారు. అయితే ప్రజల్లో ఎంత స్పందన ఉందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.
కవితను ఈడీ అరెస్టు చేసినప్పుడు ప్రజల్లో అసలు స్పందన లేదు. స్వయంగా నిరసనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడు అంటే రాష్ట్రానికి సంబంధం లేని అంశంపై ఈడీ అరెస్టు చేసింది కాబట్టి ప్రజల్లో స్పందన లేదని సరి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు కేటీఆర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తే అది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనన్న భావన ప్రజల్లోకి పంపేలా బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రజల్లో స్పందన లేకుండా బీఆర్ఎస్ ఏం చేసినా ప్రయోజనం ఉండదు. అందుకే.. ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్నది ఎప్పటికప్పుడు సర్వేలు చేసుకుంటున్నారు.
బయటకు ఎనభై శాతం మంది కేటీఆర్ అవినీతి చేశారని నమ్మడం లేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు కానీ.. నిజంగా ఆ స్థాయిలో కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఆ విషయం బీఆర్ఎస్ నేతలకు తెలుసు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ , బీజేపీ నేతల్ని అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా అరెస్టు చేసేవారు. బండి సంజయ్ తో పాటు రేవంత్ రెడ్డి ఇలా ఎన్నో సార్లు అరెస్టులకు గురయ్యారు. జైళ్లకు వెళ్లారు. వారితో పోలిస్తే కేటీఆర్ చాలా గౌరవ ప్రదమైన విచారణ ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు ఊరట లభించకపోవడంతో ఎక్కువ మంది ఈ కేసులో కేటీఆర్ ఏదో చేశారని అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.