జనసేన పార్టీకి ఎంతో కొంత చేయాలనుకునే కార్యకర్తలు ఉంటారు. అయితే జనసేన పేరుతో సంపాదించుకునేవారు కొంత మంది ఉంటారు. వారు చాలా డేంజరస్. ఇలాంటి వారి వల్ల పార్టీకి ఎంత లాభం ఉంటుందో చెప్పడం కష్టం కానీ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఒక్కరైనా జనసేన పేరుతో వ్యాపారం చేసుకునే ప్రయత్నం చేసి జనాలను దోపిడీ చేస్తే సహించేది లేదని సంకేతాలు ఇస్తున్నారు. దానికి తాజా సూచిక పెనుమలూరు జనసేన ఇంచార్జ్ పై వేటు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సారి సంక్రాంతికి కోడి పందేల బరులు అన్నీ కూటమి నేతల కనుసన్నల్లోనే ఏర్పాటు చేశారు. అయితే పండుగ సంబరాలు కాబట్టి శృతి మించనంత వరకూ పార్టీ అధినేతలు కూడా పట్టించుకోలేదు.కానీ కొంత మంది జనసేన నేతలు ఇదే సందు అనుకుని ఇష్టారాజ్యంగా దోపిడీ చేసే ప్రయత్నం చేశారు. అందులో పెనుమలూరు ఇంచార్జ్ ముప్పా రాజా ఒకరు. ఆయన బరుల వద్ద పార్కింగ్ ఫీజులు రూ. రెండు వందల చొప్పున టిక్కెట్లు ప్రింట్ కొట్టి మరీ వసూలు చేశారు. అదొక్కటే కాదు.. కోడి పందేల బరుల దగ్గర జనసేన ఇంచార్జ్ పేరుతో చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు.
ఇవన్నీ హైకమాండ్ దృష్టికి పోవడంతో నిర్మోహమాటంగా ఆయనను సస్పెండ్ చేస్తూ పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి వారిని సహించేది లేదని తేల్చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ పేరుతో దందాలు చేసేందుకు సంపాదనకు సిద్దమయ్యేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిని మొదట్లోనే కట్టడి చేయకపోతే.. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే పవన్ .. ఎలాంటి వివరణ కూడా లేకుండా నేరుగా వేటు వేశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.