ఆదివారం ఏపీలో అధికారిక పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా… ఒక రోజు ముందుగానే ఏపీకి రానున్నారు. శనివారం సాయంత్రం ఆయన విజయవాడ వస్తారు. చంద్రబాబు నివాసంలో విందు భేటీలో పాల్గొంటారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోపాటు కూటమికి చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
గతంలోనూ అమిత్ షా ఇలా ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు ఒక రోజు ముందుగానే వస్తారు. చంద్రబాబు నివాసంలో విందు సమావేశం నిర్వహించేవారు. ఈ సారి మాత్రం ప్రత్యేకమైన చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటిపోయింది. ఆర్థికంగా..పాలన పరం.. వ్యవస్థల పరంగా గాడిన పెట్టేందుకు ఇప్పటి వరకూ సమయం కేటాయించారు. ఇక రాజకీయంగానూ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి వస్తున్నారు. నారా లోకేష్ గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై .. రాష్ట్ర దర్యాప్తు సంస్థలే కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారు.
ఇసుక, లిక్కర్ వ్యవహారాల్లో భారీ స్కాములు ఉన్నాయి. ఇసుక వ్యవహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్లుగా తవ్వేసి దోపిడీ చేశారని రికార్డులు రెడీ చేశారు.ఆధారాలు కూడా రెడీగా ఉన్నాయి. లిక్కర్ స్కాములోనూ అంతే. వీటిలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని.. ఆ డబ్బులు ఎక్కడెక్కడకి ఎలా చేరాయో కూడా ఆధారాలు సేకరించారని అంటున్నారు. వీటన్నింటిపై విందు సమావేశంలో చర్చించి.. తీసుకోవాల్సిన చర్యలపై ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అమిత్ షా విందు భేటీ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.