ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పది శాతం గీత కార్మిక కులాలకు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు 340 దుకాణాలు కేటాయించింది. వాటికి ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఓ గీత కార్మిక కుటుంబానికి మద్యం దుకాణం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వారికి ఓ దుకాణం కేటాయించి మిగిలిన 339 దుకాణాలకు ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలోనూ పది శాతం వరకూ మద్యం దుకాణాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే అక్కడ లైసెన్స్ ఫీజు విషయంలో పెద్దగా మినహాయింపులు ఇవ్వలేదు. ఈ కారణంగా ఆయా కులాలకు చెందిన వ్యక్తుల పేర్లతో ఇతరులు దరఖాస్తులు చేసుకున్నారు. లాటరీలో దుకాణాలు పొంది.. వారే నిర్వహిస్తున్నారు. వారి పేరు ఉపయోగించుకున్నందుకు కొంత సొమ్ము చెల్లిస్తున్నారు. ఎక్కవగా ఇలాంటి ఘటనలే ఉండటంతో ఏపీ ప్రభుత్వం… ఆయా కులాలకు చెందిన వారే వ్యాపారాలు చేసుకునేలా చూస్తోంది. అప్లికేషన్ ఫీజును తగ్గించింది. అలాగే పలు రకాల రాయితీలు ఇచ్చేందుకు .. వారు వ్యాపార పరంగా మెరుగుపడేందుకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించింది.
గీతా కార్మిక కుటుంబాలకు వృత్తి పరంగా మద్యం వ్యాపారం మీద అవగాహన ఉంటుంది. అయితే పోటీ పడి వారు మద్యం దుకాణాలను దక్కించుకునేంత ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. ఉంటే.. గతంలోనే ప్రయత్నించేవారు. ఇప్పుడు కింది కులాల్లోని వారికి అవకాశాలు కల్పించి మద్యం వ్యాపారం ద్వారా వారు ఆర్థికంగా స్థిరపడేలా చేయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధానం సక్సెస్అయితే.. బీసీ వర్గాల్లో ని చాలా కులాలు.. ఆర్థికంగా బలపడేందుకు పునాదులు ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.