మలయాళం సినిమా ‘సూక్ష్మ దర్శిని’ కొన్నాళ్ళుగా టాక్ అఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. మలయాళంలో విడుదలైన ఈ థ్రిల్లర్ అంచనాలకు మించి ఆడింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నిజంగా ఇది ఓ ప్రత్యేకమైన సినిమానే. ఒక మామూలు కథని ప్రేక్షకుడు అతుక్కునేలా ఎంత గ్రిప్పింగ్ గా తీయోచ్చో చూపించే సినిమా.
నిజానికి ఈ సినిమా మూలకథ వింటే..చాలా వరకు నిర్మాతలు ఆసక్తి చూపించరు. పైగా అలాంటి పరువు హత్యల మీద ఇదివరకే కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ సూక్ష్మ దర్శిని ట్రీట్మెంట్ కంప్లీట్ డిఫరెంట్. మూలకథని ఒక సీన్ కి పరిమితం చేసి.. సస్పెన్స్ థ్రిల్లర్ లా మలిచిన విధానం భలే కుదిరింది. చాలా మంది ఆడియన్స్ చివరి వరకూ ఆ ట్విస్ట్ ని గెస్ చేయలేరు. కొంతమంది గెస్ చేసినా.. అసలు ఇంత గొప్పగా ఎలా డైవర్ట్ చేశారబ్బా అనే సర్ ప్రైజ్ తో చూస్తారు.
ముఖ్యంగా థ్రిల్లర్స్ కథలు రాసుకునే రైటర్స్ లోతుగా పరిశీలిన చేయాల్సిన స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ ఇది. మలయాళం రైటర్స్ కథలతోనే కోట్లు కొల్లగొడతారు. సూక్ష్మ దర్శిని తో అది మరోసారి రుజువైయింది. సోషల్ కామెంటరీ వున్న కథతో డార్క్ కామెడీ, సస్పెన్స్, థ్రిల్ ని మిక్స్ చేసిన విధానం అబ్బురపరుస్తుంది.
నటీనటులు ఎంపికలో కూడా సినిమాకి ఫుల్ మార్కులు పడిపోతాయి. నజ్రియా నజీమ్, బసిల్ జోసెప్ ఇద్దరూ అదరగొట్టేశారు. మంచి స్క్రిప్ట్ మంచి నటులు చేతిలో పడితే రిజల్ట్ ఎంత బెటర్ గా వుంటుందో ఇందులో చూడొచ్చు. సినిమా హాట్ స్టార్ లో వుంది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చేసే సినిమా ఇది.