అనిల్ రావిపూడి ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు చేశారు. ఈ ఎనిమిది కూడా నిర్మాతలని సంతోష పెట్టిన సినిమాలే. అనిల్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా వచ్చేసింది. అయితే ఇలాంటి ట్రాక్ రికార్డ్ వున్న అనిల్ పై కొన్ని విమర్శలు వున్నాయి. ఆయన ప్రతి సినిమాకి క్రింజ్ అనే కామెంట్స్ వస్తుంటాయి. కొంతమంది క్రిటిక్స్ ఆయన్ని ఒరిజినల్ ఫిల్మ్ మేకర్స్ కేటగిరీలో చూడరు. లేటెస్ట్ గా వచ్చిన సంక్రాంతి వస్తున్నాం సినిమాపై కూడా ఇవే తరహా కామెంట్స్ వినిపించాయి. జబర్దస్త్ స్కిట్స్ లా సినిమాని తయారు చేశాడని, ఫ్యామిలీ సినిమా పేరుతో క్రింజ్ ఎలిమెంట్స్ నింపేశారనే విమర్శలు వచ్చాయి.
తనపై వచ్చే విమర్శల విషయంలో అనిల్ కి కూడా ఒక ఐడియా వుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే చాలా చోట్ల అనిల్ ఈ విషయంలో ఓపెన్ అయ్యారు. ‘వరుసగా ఇన్ని విజయాలు ఇచ్చినప్పటికీ కూడా నన్ను చాలా మంది విమర్శకులు సీరియస్ గా తీసుకోరు. డైరెక్టర్ గా నా ఎబిలిటీపై వారికి ఇంకా నమ్మకం కుదరలేదు’అని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ రోజు జరిగిన సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ లో పరోక్షంగా ఈ క్రింజ్ కామెంట్స్ పై ఇంకాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. ‘నేను స్క్రీన్ ప్లే రాయుడం నేర్చుకోలేదు. ఫిల్మ్ మేకింగ్ చదవలేదు. కొందరు రివ్యూ రైటర్స్ రాసే పదాలు కూడా నాకు తెలీవు. నాకు తెలిసిందంత ప్రేక్షకుడు విజల్ కొట్టే సినిమా. నేను అలాంటి సినిమాలు చూస్తూనే పెరిగాను. ఇకపై కూడా ఇలాంటి సినిమాలే తీస్తాను’ అని నిర్మోహమాటంగా చెప్పారు అనిల్.