ప్రైవేటీకరణ ముప్పులో పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూటమి ప్రభుత్వం కాపాడుకుంది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రివైవల్ ప్యాకేజీని ప్రకటించేలా చేసింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక పరమైన కష్టాలు తీరినట్లే అనుకోవచ్చు. మొత్తంగా పదొండు వేలకోట్లకుపైగా సాయం స్టీల్ ప్లాంట్ కు అందనుంది. ఇందులో 1100 కోట్లకుపైగా ఆపరేషనల్ వ్యయం కోసం నగదు రూపంలో అందుతాయి. ఇది స్టీల్ ప్లాంట్ కు ప్రాణం పోసే నిర్ణయమని కార్మిక వర్గాలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఈ కేటాయింపుల గురించి కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీలో పది వేల కోట్లకుపైగా సాయం స్టీల్ ప్లాంట్ కు అందేలా నిర్ణయం తీసుకున్నామి తెలిపారు. స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అన్నారు. ఆత్మనిర్భర భారత్‌లో కీలకమన్నారు. అంటే.. ప్రదాని మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని చెప్పినట్లే అనుకోవచ్చు. గతంలోనే ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేసినట్లుగా ప్రకటించారు.
ఈక్వీటీ సాయంతో ఉత్పత్తి పెంచేందుకు బ్లాస్ట్ ఫర్నేస్‌లను అందుబాటులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ హయంలో స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. అయితే వైసీపీ మాత్రం ఎదురు చెప్పలేకపోయారు. ఢిల్లీలో ఓ రాజకీయం.. విశాఖలో మరో రాజకీయం చేసి ప్రజల్ని మోసం చేశారు. చివరికి భూములు అమ్మాలని ఉచిత సలహాలు కూడా జగన్ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి.. స్టీల్ ప్లాంట్ ఎలా బయటపడేయాలన్నదానిపై ఫార్ములా రెడీ చేశారు. ఆ ప్రకారం.. ఇప్పుడు పెద్ద ఎత్తున రివైవల్ ప్యాకేజీ కి ఆమోద ముద్ర వేయించుకున్నారు.