ఏపిలో తెదేపా,భాజపాల మళ్ళీ మరో కొత్త యుద్ధం ప్రారంభం అయ్యింది. కృష్ణాపుష్కరాల కోసం విజయవాడలో రోడ్లు వెడల్పు చేయడం కోసం అధికారులు కొన్ని ఆలయాలను కూల్చివేయడంతో రాష్ట్ర భాజపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు తదితరులు నిన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తరువాత తెదేపాపై నిప్పులు చెరిగారు.
సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ, “రోడ్లు వెడల్పు చేయాలనుకొన్నప్పుడు సాధారణంగా రోడ్డుకి రెండు వైపులా ఉన్న భవనాలను తొలగిస్తుంటారు. కానీ ఇక్కడ ఒకవైపు తెదేపా నేతల భవనాలు ఉండటంతో వాటిని కాపాడేందుకు రెండో వైపున్న భవనాలను, ఆలయలాను కూల్చివేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆలయాల కూల్చివేతని ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి. ఇకపై ఒక్క ఆలయాన్ని ముట్టుకొన్నా ఊరుకోము. కూలద్రోసిన ఆలయాలని ప్రభుత్వమే మళ్ళీ పునర్నిర్మించాలి,” అని హెచ్చరించారు.
భాజపా నేతల విమర్శలకి విజయవాడ తెదేపా ఎంపి కేశినేని నాని బదులిస్తూ, “అధికారులు అందరినీ సంప్రదించిన తరువాతనే రోడ్లు వెడల్పు కార్యక్రమం చేపట్టారు. ఆలయాలని కూల్చివేస్తున్నామని భాజపా నేతలు ఆరోపణలు చేయడం సరికాదు. అసలు భాజపా ఎంపికి విజయవాడలో పనేమిటో అర్ధం కావడం లేదు. వాళ్ళు మాట్లాడదలిస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి లేదా రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు వగైరాల గురించి మాట్లాడాలి. వాటి గురించి మాట్లాడకుండా, ఈ సమస్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి వీలైతే రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి తప్ప అడ్డుకోరాదు. ప్రభుత్వమే ఆలయాలను పునర్నిర్మిస్తుందని ముఖ్యమంత్రి చెపుతున్నారు కనుక దీనిపై భాజపా నేతలు రాజకీయాలు చేయకుండ ఉంటే మంచిది,” అని అన్నారు.
ఈ సమస్య తీవ్రతని గుర్తించిన ప్రభుత్వం తక్షణమే ముగ్గురు మంత్రులతో కూడిన ఒక కమిటీని వేసింది. వారిలో భాజపాకే చెందిన రాష్ర్ట దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఉన్నారు. వారు కూడా నిన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తరువాత మాణిక్యాల రావు మీడియాతో మాట్లాడుతూ, “రోడ్లు వెడల్పు కోసం తొలగించిన ఆలయాలన్నిటినీ ప్రభుత్వమే పునర్నిర్మించి ఇస్తుంది. దీనిపై ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు,” అని క్లుప్తంగా చెప్పారు.
ఇటీవల పుష్కర పనులు పురోగతిని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగవంతం చేయాలని ఆదేశించినప్పుడు వారు ఆయనకి ఈ సమస్య గురించి చెప్పారో లేదో తెలియదు. రోడ్డుకి ఒకవైపు తెదేపా నేతల భవనాలు, మరోపక్క ఆలయాలు ఉన్నప్పుడు రోడ్లు వెడల్పు కార్యక్రమం వారికి కత్తిమీద సాము వంటిదే. ఆలయాలు, మశీదులు, చర్చిలని తొలగించడం చాలా సున్నితమైన విషయమని అధికారులకి తెలిసి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు మొదలుపెట్టినట్లు స్పష్టం అవుతోంది. రోడ్లు వెడల్పు చేయడానికి ఆలయాలు తొలగించాలని అధికారులకి, ప్రభుత్వానికి తెలిసి ఉన్నప్పుడు, ముందుగా ప్రతిపక్ష పార్టీలతో, మిత్రపక్షమైన భాజపాతో చర్చించి ఉండి ఉంటే ఈ సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తేసుకోవడం వలననే గోటితో పోయే సమస్య గొడ్డలి వరకు వచ్చింది. ఇకనైనా ఈ విషయంలో ప్రభుత్వం తప్పటడుగులు వేయకుండా జాగ్రత్తపడితే మంచిది.