మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఆ తరవాత రెండు రోజుల పాటు షూట్ కూడా చేశారు. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంకా చోప్రా నటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు కానీ, ప్రియాంక దాదాపు ఖరారైనట్టే. ఇప్పుడు ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో లాండ్ అయ్యింది. ఇటీవల టొరెంటో వెళ్లింది ప్రియాంకా. అక్కడ్నుంచి దుబాయ్, దుబాయ్ నుంచి హైదరాబాద్ ప్రయాణం అవుతున్నట్టు ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. దాంతో.. మహేష్ సినిమా కోసమే ప్రియాంకా హైదరాబాద్ వస్తున్నట్టు ఫ్యాన్స్ కూడా బలంగా ఫిక్సయిపోయారు. ఆమధ్య ప్రియాంక లుక్ టెస్ట్ లోనూ పాల్గొందని, ఇక నేరుగా షూటింగ్ మొదలెట్టేస్తారని ప్రచారం జరుగుతోంది. వచ్చే వారం షూటింగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవే రూట్ లో.. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్ తీర్చిదిద్దుతున్నారు. అక్కడే షూటింగ్ జరగబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్.
ఈ సినిమా ఓ అడ్వైంచెరస్ థ్రిల్లర్ అని ఇది వరకే విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చారు. ఇండియానా జోన్స్ తరహాలో సాగుతుందని చెప్పారు. మరోవైపు ఈ సినిమాలో మహేష్ పాత్ర రాముడ్ని పోలి ఉంటుందని వార్తలొస్తున్నాయి. ఈ రెండు ప్రపంచాల్ని రాజమౌళి ఎలా మిక్స్ చేస్తాడన్నది ఆసక్తికరం. ఫృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా నటించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో కీలక పాత్ర పోషిస్తాడని కూడా అంటున్నారు. వీటిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది.