స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రూ. 11, 44౦ కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దీంతో ఏపీలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రాజకీయ నేతలంతా తమ ఘనతేనని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఒకటి కావొచ్చు కానీ.. ఈ సాయం మాత్రం ఏపీకి చెందింది కాదు… ప్రజలు కానీ ప్రభుత్వానికి కానీ ఒక్క రూపాయి లాభం లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ లో ఏపీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి షేర్ లేదు. అంతా కేంద్రానిదే. అంటే కేంద్రానికి కేంద్రం సాయం చేసుకుందన్నమాట మరి ఏపీలో ఎందుకు సంబరాలు ?
స్టీల్ ప్లాంట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌కు చెందిన ప్లాంట్. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. వంద శాతం షేర్ కేంద్రానికే ఉంటుంది.కేంద్రం ఇప్పుడు ప్రకటించిన రివైవల్ ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకే ప్రకటించారు. అంటే.. కేంద్ర ప్రభుత్వం తన సంస్థకే ప్రకటించింది. కానీ ఇక్కడ ఆ సంస్థ విశాఖలో ఉంది. స్టీల్ ప్లాంట్ నిర్వహిస్తోంది. ఆ సంస్థ నష్టాల్లో ఉంది. ప్రైవేటీకరణ చేయాలని అనుకోవడం వల్ల ఏర్పడిన సమస్యలతో సెంటిమెంట్ గా మారింది. అందుకే రాష్ట్రానికి చెందినదా..కాదా అన్న దానితో సంబంధం లేకుండా ప్రజల సెంటిమెంట్ మేరకు దాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. సక్సెస్ అయ్యారు.
స్టీల్ ప్లాంట్ కార్మికుల్లో అందరూ తెలుగువాళ్లు కాదు. ఎక్కువ మంది ఒడిషా వాళ్లు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. కేవలం అ ప్లాంట్ ఏపీలో ఉందన్న కారణం.. ఆ ప్లాంట్ సాధనకు గతంలో జరిగిన ఉద్యమం కారణంగా ఉన్న సెంటిమెంట్ కారణంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకించారు. ప్రజల సెంటిమెంట్ కాబట్టి.. ఎన్నికలతో .. ఓట్లతో ముడిపడిన అంశం కాబట్టి కేంద్రం కూడా.. ఆత్మనిర్భర్ భారత్ కింది.. రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. ఇది ప్రజల భావోద్వేగాన్ని సంతృప్తి పరుస్తుంది కానీ.. ఆర్థికంగా ఏపీకి ఎలాంటి ప్రయోజనాన్ని అందించదు.