సూపర్ హిట్ సినిమాని అలా ఖాళీగా ఉంచడం లేదు దర్శకులు. సీక్వెలో, ప్రీక్వెలో లాంగించేస్తున్నారు. ఇది ఓ రకంగా మార్కెటింగ్ స్ట్రాటజీ. సినిమా హిట్టయినా, ఫట్ అయినా.. ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకొనే మార్గం. అందుకే పార్ట్ 2లు జోరుగా వస్తుంటాయి. బాలీవుడ్ లో `సన్ ఆఫ్ సర్దార్ 2` తీస్తున్నారు. తెలుగులో మంచి విజయాన్ని అందుకొన్న `మర్యాదరామన్న`కు రీమేక్ గా ‘సన్ ఆఫ్ సర్దార్’ తీశారు. హిట్ కొట్టారు. ఇప్పుడు దాన్ని రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ హీరో. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్. ఈ సినిమా రీమేక్‌కు సంబంధించిన అనుమతుల్ని రాజమౌళి నుంచి చిత్రబృందం తీసుకొందా, లేదా? అనే చర్చ నడుస్తోంది. నిజానికి ‘మర్యాద రామన్న’ ఒర్జినల్ స్టోరీ ఏం కాదు. హాలీవుడ్ లో ‘అవర్ హాస్పటాలిటీ’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు స్ఫూర్తిగా ‘మర్యాద రామన్న’ తీశారు. చాలా సన్నివేశాలు హాలీవుడ్ నుంచి ఎత్తేసినవే. స్టోరీ లైన్ కూడా ఇంచుమించుగా అదే.
నిజానికి ‘మర్యాదరామన్న’ బలం.. ఆ ఇంటి సెంటిమెంట్ లోనే వుంది. గడప దాటితే ప్రాణాలు పోతాయని తెలిసిన హీరో, ఆ ఇంట్లోనే ఉంటూ ఎలా మేనేజ్ చేశాడు, చివరికి విలన్ల మనసు ఎలా మార్చాడు? అనేది చూపించారు. ఇప్పుడు సీక్వెల్ లో ఏం చూపిస్తారు? అనేది ఆసక్తికరం. ఇంట్లో సేమ్ సెటప్ రిపీట్ చేస్తే – చూడ్డానికి కొత్తగా ఏం ఉండదు. అలాగని ఆ ఇల్లు దాటి బయటకు వచ్చి ఓ కథ చెబితే, దాన్ని రిసీవ్ చేసుకొంటారా? అనేది అనుమానమే. మొత్తానికి రాజమౌళి సినిమాకు సీక్వెల్ తీసే ధైర్యం బాలీవుడ్ చేస్తోంది. ఆ ఐడియా మనకెందుకు రాలేదో?
‘విక్రమార్కుడు 2’ కూడా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. ఈ సినిమా సీక్వెల్ కు సరిపడా కథ విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. కానీ… సరైన దర్శకుడే దొరకడం లేదు. మధ్యలో ఈ సీక్వెల్ చేద్దామని సంపత్ నంది ప్రయత్నించారు. కానీ వర్కవుట్ అవ్వలేదు.