నరేంద్ర మోడీ ప్రభుత్వం భూసేకరణ బిల్లునుచట్టంగా మార్చడానికి చాలా కష్టపడుతోంది. ప్రతిపక్షాలు అడ్డుపడటం వల్ల ఇంకా అది పార్లమెంటు గడపదాటలేదు. మోడీ సర్కార్ ప్రతిపాదించిన సవరణలు రైతు వ్యతిరేకమని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, తెల్లవాడి పాలన నుంచీ రైతుకు అన్యాయమే. ఆనాటి అన్యాయాన్ని సరిచేయాలంటూ యోగేంద్ర యాదవ్ ఇతర నాయకులు గళమెత్తిన పాపానికి అర్ధరాత్రి వేళ అరెసయ్యారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న వారందరినీ అర్ధరాత్రి అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ఇంతకీ వారు చేసిన నేరం ఏమిటి? ప్రజా ప్రయోజనార్థం అనే పేరుతో 1912లో ఆంగ్లేయుల పాలనలో రైతుల నుంచి 1792 ఎకరాల భూమిని ప్రభుత్వం భూ సేకరణ పేరుతో లాక్కుంది. ఎకరానికి 15 నుంచి 30 రూపాయల నష్టపరిహారం ఇచ్చింది. రైతులు మాత్రం దీనికి ఒప్పుకోలేదు ఎకరానికి 1600 నుంచి 2400 రూపాయల పరిహారాన్ని కోరారు. తెల్లవాడి ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యాయం కోరిన రైతులను బలవంతంగా గెంటేశారు. వారికి రీసెటిల్ మెంట్ కూడా చేయలేదు. తర్వాత ఆ స్థలాన్ని ఢిల్లీ రేస్ క్లబ్ కోసం లీజుకు ఇచ్చారు. అందులో గుర్రప్పందాలు జరుగుతుంటాయి.
సదరు లీజు గడువు 1998లో ముగిసింది. అయినా రేస్ కోర్సు నడుస్తూనే ఉంది, అదీ ప్రభుత్వానికి పైసా కిరాయి గానీ లీజు సొమ్ముగానీ చెల్లించకుండానే. కేంద్రం 1999లో మొక్కుబడిగా ఓ నోటీసు పంపింది. అంతే, ఆ తర్వాత లీజును పొడిగించలేదు అంటే పూర్తి ఉచితంగా రేస్ క్లబ్ దర్జాగా అంత జాగాను అనుభవిస్తోంది. దాని స్థానంలో రైతు స్మారకాన్ని నిర్మించాలని యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ నుంచి రేస్ కోర్సు వరకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లి, ఓ నాగలిని అక్కడ స్మారకంగా ఉంచాలని భావించారు. అలా చేస్తే ప్రభుత్వానికి కోపం వస్తుందనుకున్నారో ఏమో ఢిల్లీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యోగేంద్ర యాదవ్ ను, మరికొందరిని టెర్రరిస్టుల్లా అరెస్టు చేసి ఈడ్చుకెళ్లారు.
17 సంవత్సరాలుగా కనీసం లీజును రెన్యువల్ లేకుండా, ప్రభుత్వానికి పైసా ఆదాయం రాకుండా చోద్యం చూస్తున్న ప్రభుత్వంలోని పెద్దల సంగతి ఏమిటి? వారి వైఫల్యానికి ఏ శిక్ష విధించాలి? అధికార పార్టీ ఏదైనా ధనికుల పక్షపాతిగానే వ్యవహరించిందని రైతు నేతలు ఆక్రోశిస్తున్నారు. రైతుల తరఫున ప్రశ్నిస్తే అరెస్టు చేసి ఈడ్చుకుపోతారా అని ప్రశ్నిస్తున్నారు. పైగా అరెస్టు పేరుతో తమ మీద పోలీసులు చేయి చేసుకున్నారని, గూండాల్లా ప్రవర్తించారని యాదవ్ ఆరోపించారు. వారి డిమాండులో న్యాయం ఉందనే ఆలోచన కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు ఇష్టా రాజ్యం చెలాయించడం సొంత నిర్ణయమా? మోడీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశమా?