పులివెందులలో టీడీపీకి ఇద్దరు కీలక నేతలు ఉన్నారు. ఒకరు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మరొకరు బీటెక్ రవి. ఇద్దరూ జగన్ రెడ్డిని ధైర్యంగా ఎదిరించి పోరాడిన వారే. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో జగన్ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నీటి సంఘాల ఎన్నికలను ఏకగ్రీవం చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య ఆధిపత్యపోరాటం ప్రారంభమయింది. తమ అనుచరులకే ప్రభుత్వ పనులు దక్కాలని ఇద్దరూ ప్రయత్నించి తమ స్టైల్లో దౌర్జాన్యాలకు దిగుతూండటంతో సమస్యగా మారుతోంది.
ఇసుక టెండర్లు, రేషన్ దుకాణాల టెండర్ల విషయంలో రెండు వర్గాల మధ్య ఇలాంటి సమస్యలే వచ్చాయి. చివరికి ఎమ్మెల్సీ భార్య ధర్నా చేయాల్సి వచ్చింది. రెండు వర్గాలు ఎవరికి వారు తమ వాదనల్ని వినిపిస్తున్నారు. వైసీపీకి చెందిన వారికి అవకాశాలు కల్పిస్తున్నారని అందుకే అడ్డుకుంటున్నామని బీటెక్ రవి వర్గీయులు వాదిస్తున్నారు. అయితే వారు తమ కోసం పని చేశారని ఎమ్మెల్సీ వర్గీయులు అంటున్నారు. కారణాలు ఏవైనా ఇప్పుడు రెండు వర్గాలు పోటాపోటీగా తమ అనుచరులకు పనులు అప్పగించాలని ధర్నాలకు దిగడం సమస్యగా మారుతోంది.
జగన్ రెడ్డి ఎప్పుడూ లేనంత బలహీనంగా ఉన్నారు. ఆయన కుటుంబం కూడా ఆయన వెంట లేదు. ఇలాంటి సమయంలో రాజకీయంగా దెబ్బకొట్టి పునాదుల్ని పెకిలించడానికి అవకాశం ఏర్పడింది. ఆ దిశగాప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎలాంటి చాన్స్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు. అయితే రెండు పిల్లర్స్ గా ఉంటారనుకున్న పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం టీడీపీకి సమస్యగా మారుతోంది.