హైదరాబాద్ రియల్ఎస్టేట్ మార్కెట్లో కోకాపేట మరో జూబ్లిహిల్స్ గా మారింది. ఒకప్పడు జూబ్లిహిల్స్ అంటే ధనవంతుల ఏరియా. ఇప్పుడు అక్కడ అంతా కమర్షియల్ అయిపోయింది. చాలా మంది కుబేరులు శివారు ప్రాంతాల వైపు చూస్తున్నారు. మెల్లగా ఇలాంటి వారంతా కోకాపేట వైపు చూస్తున్నారు. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా వారు బంగళాల్ని కట్టుకోవడం కన్నా.. హై రైస్ అపార్టుమెంట్లలో నివాసం ఉండటం మేలనుకుంటున్నారు. వారి ఆలోచనలకు తగ్గట్లుగా పరిమిత ఫ్లాట్లతో అత్యంత లగ్జరీ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు.
కోకాపేటలో కనిపించే చాలా హై ఎండ్ ఆకాశ హర్మ్యాలు ఎగుువ మధ్యతరగతి వారికి కూడా అందవు. సాస్ క్రౌన్ అనే ప్రాజెక్టు అరవై అంతస్తులతో నిర్మించారు. ఐదు టవర్లు … అరవై అంతస్తులు అయినప్పటికీ .. యూనిట్స్ చాలా తక్కువ. కనీసం ఓ ఆపార్టుమెంట్ 6565 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. అంటే సాధారణ టూ బెడ్ రూం అపార్టుమెంట్లు వెయ్యి ఎస్ఎఫ్టీ అయితే.. ఏడు అపార్టుమెంట్లు కలిస్తే ఒకటన్నమాట. అతి పెద్దది 8811 Sft ఉంటుంది. అంతర్జాతీయస్థాయి ఆర్కిటెక్చరల్ డిజైన్లతో నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇదే కాదు కోకాపేటలో నిర్మిస్తున్న అన్ని అపార్టుమెంట్లలో కనీసం పదివేల స్క్వేర్ ఫీట్స్ ఉండే ఫ్లాట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రిప్లెక్స్ తరహాలో ఉంటాయి. బంగళాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో నిర్మాణం ఉంటుంది.
కోకాపేటలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ప్రకటిస్తున్న ప్రాజెక్టుల్ని చూస్తే.. కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వారికేనని అర్థమవుతుంది. మధ్యతరగతికి అందుబాటులో కోకాపేటలో ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. అంటే హైదరాబాద్ లో అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంగా రెండేళ్లలో కోకాపేటకు ప్రత్యేక గుర్తింపు రానుంది. ఇది మంచికో చెడుకో.. కాలమే నిర్ణయించాలి.