తెలంగాణా జిల్లాలను పునర్విభజించి కొత్తగా మరో 14జిల్లాలు ఏర్పాటు చేయాలనే తెరాస ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణాలో మళ్ళీ రాష్ట్ర విభజన నాటి ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం అవుతున్నట్లున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లుగా కాకుండా తమ అవసరాలకి, అభీష్టానికి తగ్గట్లుగా జిల్లాలని ఏర్పాటు చేయాలని కొన్ని జిల్లాలలో ప్రజలు కోరుతున్నారు. కొన్ని జిల్లాల విభజన వలన ప్రతిపక్షనేతలు తమ నియోజకవర్గాలపై పట్టుకోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో వారు కూడా ప్రభుత్వ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారు. అధికార తెరాస నేతలు కూడా కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నందున వారు మౌనం వహించాల్సివస్తోంది. జిల్లాల పునర్విభజన పరిపాలనా సౌలభ్యం కోసమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ పదేపదే చెపుతున్నారు. దసరానాటికి కొత్త జిల్లాలన్నీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయని కెసిఆర్ ప్రకటించారు.
అయితే, తెరాస తన రాజకీయ అవసరాలు, లెక్కలు, ప్రయోజనాలు చూసుకొని జిల్లాల విభజన చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల సంఖ్య పెంచడం ద్వారా పార్టీలో రాజకీయ నిరుద్యోగులు అందరికీ ‘ఉపాధి’ కల్పించేందుకే హడావుడిగా జిల్లాల విభజనకి పూనుకొంటున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. లేకుంటే ఇంత హడావుడిగా ఇప్పుడు కొత్తగా జిల్లాల ఏర్పాటుచేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ముందుగా పరిష్కరించుకోవలసిన అనేక సమస్యలుండగా వాటి గురించి ముందు ఆలోచించకుండా జిల్లాల ఏర్పాటుకి పూనుకోవడం అందుకేనని వాదిస్తున్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలని, ప్రతిపక్షాలని, ఎవరినీ సంప్రదించకుండా, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా తెలంగాణా తన సామ్రాజ్యం అన్నట్లుగా దానికి తను చక్రవర్తిని అన్నట్లుగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని జిల్లా విభజన చేస్తున్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
వరంగల్ జిల్లాని విడదీసి భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లాని ఏర్పాటు చేయడాన్ని జిల్లా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ‘మునుగు’ కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని అధైతేనే తమకి సౌకర్యంగా ఉంటుందని కోరుతున్నారు. నల్గొండలో యాదాద్రి కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేయాలని తెదేపా నేత మోత్కుపల్లి నరసింహులు పోరాడుతున్నారు. అలాగే వివిధ జిల్లాలలో ప్రజలు, ప్రతిపక్ష నేతలు కూడా అటువంటి డిమాండ్లతోనే జిల్లాలలో ర్యాలీలు, బంద్ లు నిర్వహిస్తున్నారు.
ఒకప్పుడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఏపిలో ఎటువంటి వ్యతిరేకత కనిపించేదో, ఇప్పుడు తెలంగాణాలో జిల్లాల పునర్విభజన కారణంగా అటువంటి వ్యతిరేకతే కనిపిస్తోంది. ఒకప్పుడు కెసిఆర్ కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్ పాలకులని ఏవిధంగా నిందించేవారో ఇప్పుడు తెలంగాణాలో జిల్లాల ప్రజలు, ప్రతిపక్ష నేతలు అదేవిధంగా కెసిఆర్ ని నిందిస్తున్నారు. ఒకప్పుడు కేంద్రం ఏపి ప్రజలని, రాష్ట్ర ప్రజా ప్రతినిధులని పట్టించుకోకుండా ఏవిధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకొందో, ఇప్పుడు కెసిఆర్ కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు ఈవిధంగా తెలంగాణాలో మళ్ళీ పునరావృతం అవుతుండటం చాలా విచిత్రంగానే ఉంది. ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లుగా, జిల్లాల పునర్విభజన ప్రక్రియని కెసిఆర్ అనవసరంగా మొదలుపెట్టి చేజేతులా కొత్త సమస్యలను ఆహ్వానించుకొన్నట్లుంది.