కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా .. చేయరా అంటూ జరుగుతున్న చర్చలో ఆర్కే కూడా భాగమయ్యారు. ఈ వారం అదే అంశాన్ని తన పలుకులుగా పాఠకులకు వినిపించారు. కేటీఆర్ అరెస్టు పై చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం, కేసు విచారణల గురించి రాసుకొచ్చి.. అరెస్టు ఎందుకు చేయడం లేదబ్బా అని ఆశ్చర్యపోయారు. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేస్తారని ఓ సారి.. ఆధారాల్లేకపోతే గవర్నర్ ఎందుకు పర్మిషన్ ఇస్తారని మరోసారి తనకు తానే ప్రశ్నలు వేసుకున్నారు. చివరికి కేటీఆర్ కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు దొరికితేనే అరెస్టు చేస్తారని ఆయన తనను తాను సమాధానపర్చుకున్నారు. అరెస్టు చేయకపోతే ఆధారాలు లేనట్లేనని ఆయన కొత్తపలుకును వినేవారికి.. చదివే వారికి సంకేతాలు పంపారన్నమాట.
ఇప్పటి వరకూ జరిగిన కేసును ఆర్కే …వివరించారు. దాని ప్రకారం చూస్తే.. కేవలం అధికారులు మాత్రమే నిండా మునిగిపోతారు. అసలు రేసు గురించి ఒప్పందం చేసుకుంది మున్సిపల్ శాఖ. కానీ డబ్బులు కట్టించింది హెచ్ఎండీఏ. అదీ కూడా డాలర్లలో హడావుడిగా చెల్లించారు. ఒక్క అనుమతి లేదు. ఎందుకంటే కేటీఆర్ నోటి మాట ద్వారా ఆదేశించారని అధికారులు చెబుతున్నారట. అదే నిజమైతే కేటీఆర్ కు సంబంధంలేదని అధికారులు నిండా మునిగిపోతారని ఆర్కే తేల్చేశారు. కానీ ఎలక్టోరల్ బాండ్ల క్విడ్ ప్రో కో విషయంలో ఏసీబీ అధికారులు సమాచారం బయటకు లాగితే కేటీఆర్ కు తిప్పలు తప్పకపోవచ్చని అంటున్నారు.
కేటీఆర్ విషయంలో కానీ.. బీఆర్ఎస్ నేతల అవినీతి వ్యవహారాల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా మంది పజిల్ గానే ఉంది. రేవంత్ రెడ్డి పదేళ్ల పాటు ఎదుర్కొన్న వేధింపులను ఆయన గుర్తు చేసుకుంటే రాత్రికి రాత్రి కేటీఆర్ ను అరెస్టు చేసి.. జైల్లో తనను ఉంచిన కరుడుగట్టిన నేరస్తుల బ్యారక్ లో ఉంచుతారని ఎవరైనా అనుకుంటారు. ఆర్కే కూడాఅదే అనుకున్నారు. కానీ అలా అనుకునే వ్యక్తిత్వం అయితే రేవంత్ సీఎం పదవి వరకూ ఇంత వేగంగా రాకపోవచ్చు. ఆయనకు దీర్ఘ కాలిక లక్ష్యాల ఉంటాయనే లాజిక్ ను మాత్రం ఆర్కే మర్చిపోయారు.
ఆర్కే ఎప్పుడూ అలా జరుగుతుంది.. ఇలా జరుగుతుందని తన దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి చెప్పేవారు. కానీ ఆయనఅంచనాలకు కూడా అందకుండా రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. అదే విషయాన్ని ఈ వారం ఆర్కే చెప్పుకొచ్చారని అనుకోవచ్చు.