తిరుమలలో గౌరవమర్యాదలతో దర్శనం కోసం అమిత్ షాతో పాటు ఏపీకి వచ్చిన ఓ అధికారి చేసిన అతి వివాదాస్పదమయింది. టీటీడీ చైర్మన్ కు శనివారం ఓ లేఖ అందింది. దాని సారాంశం ఏమిటంటే ఓ హోంశాఖ అధికారి వచ్చి క్రౌడ్ మేనేజ్మెంట్ పై సమీక్ష చేస్తారని. అసలు సమీక్ష చేయడానికి ఆ అధికారి ఎవరు.. ఒక్కరు వచ్చి సమీక్ష చేసి ఏం చేస్తారు..? అని టీటీడీ అధికారులకు అర్థం కాలేదు. హోంశాఖ అధికారులను సంప్రదించారు. ఇదేం సమీక్ష అని ప్రశ్నించడంతో మొదట హోంశాఖ అధికారులకు అర్థం కాలేదు.
హోంశాఖ ఏదైనా రాష్ట్రంలోని అంశాలపై స్వయంగా సమీక్ష చేయాలనుకుంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఓ లేఖ రాసేసి వచ్చేస్తామని.. ఒకే అధికారి సమాచారం పంపారు. ఈ విషయాన్ని ఏపీలోనే ఉన్న అమిత్ షా దృష్టికి ప్రభుత్వ వర్గాలు తీసుకెళ్లాయి. ఆయన కూడా ఆశ్చర్యపోయారు. హోంశాఖ తరపున ఇలాంటి సమీక్ష లని నిర్వహించాలని అనుకోలేదని తక్షణం రద్దు చేసుకవాలని ఆదేశించారు. దాంతో లేఖ ఉపసంహరించుకున్నారు.
కేవలం అమిత్ షాతో పాటు ఏపీకి వస్తున్న ఆ అధికారి.. దర్శనం ప్రోటోకాల్ కోసమే ఇలా లేఖ రాశానని అంతిమగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. టీటీడీ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం తనను తీసుకెళ్లి దర్శనం చేయించి .. ఓ సమావేశం పెట్టి పంపిస్తారని అనుకున్నారు. కానీ రచ్చ అయ్యే సరికి నాలిక్కరుచుకోవాల్సి వచ్చింది.